ఎన్‌జీజీవో అసోసియేషన్ నాయకత్వంపై గవర్నర్ ప్రశంసలు
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్):సాయుధ దళాల పతాక నిధికి ఉద్యోగుల సహకారం భేష్ దేశ రక్షణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు మేమున్నామంటూ మనోధైర్యం కల్పించేందుకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమవంతు సహకారం సమకూర్చడం అభినందనీయమని, ఇందుకు ఉద్యోగులను ప్రోత్సహించిన ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ నేతల కృషి ప్రశంసనీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
శుక్రవారం నగరంలోని లోక్ భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా గవర్నర్.. ఏపీ ఎన్‌జీజీవో నేతలను అభినందించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి తదితరులతో కలిసి జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ వీర సైనికులు, వారి కుటుంబాలను ఆదుకోవడం బాధ్యతగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులు ఏటా పతాక నిధికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు. సంఘం పిలుపు మేరకు విశేషంగా స్పందించి ముందుకు వచ్చిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తు సంభవించినా సామాజిక బాధ్యతగా ప్రజలను ఆదుకోవడంలో, భరోసా కల్పించడంలో ఏపీ ఎన్‌జీజీవో ముందుంటోందన్నారు. కోవిడ్ మహమ్మారి, బుడమేరు వరదలు.. ఇలా ప్రతి సందర్భంలోనూ బాధితులకు అండగా నిలుస్తూ ఉద్యోగులు తమవంతు సహకారంతో ముందుకు రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారు జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


