ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహా సభను జయప్రదం చేయాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
భీమవరం (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 5న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న రాష్ట్ర మహా సభను విజయవంతం చేయాలని ఉద్యోగులు స్వచ్ఛందంగా హాజరై తమ ఐక్యతను చాటాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
రాష్ట్ర మహా సభ సన్నాహకాల్లో భాగంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చల వివరాలను వివరించారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు వేల సంఖ్యలో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, మహిళా ఉద్యోగినులకు సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా వినియోగించుకునేలా చైల్డ్ కేర్ లీవ్‌పై చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పలు శాఖల్లో క్రింది స్థాయి ఉద్యోగుల నామిన్క్లేచర్లో మార్పులు చేసేందుకు అన్ని శాఖాధిపతుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నారని తెలిపారు.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను 60 రోజుల్లో పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావడానికి రాష్ట్ర స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌కు సభ్యత్వం ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ రుణాలు, విత్‌డ్రాయల్స్ అన్నీ ఆన్లైన్లో ఒకేసారి అందేలా త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు. ఆర్థిక అంశాలపైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఐక్యత ఎంతో అవసరమని, ఐక్యంగా లేనప్పుడు ఏ ప్రభుత్వమూ ఉద్యోగులను గుర్తించదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5, 2026న జరిగే రాష్ట్ర మహా సభకు ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మెన్, మహిళా విభాగాల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా శాఖలో వి.వి. సత్యనారాయణ (చైర్మన్), పవన్ సత్యనారాయణ (జనరల్ సెక్రటరీ), ఎం. కనకారావు (ట్రెజరర్)గా ఎన్నికయ్యారు. మహిళా విభాగంలో డి. సుగుణ సంధ్య (చైర్పర్సన్), బి. అరుణ (జనరల్ సెక్రటరీ), ఐ. గంగారత్నం (కోశాధికారి)గా ఎంపికయ్యారు.
ఈ సమావేశంలో అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, ఏపీ వీఆర్వోల అసోసియేషన్ ప్రెసిడెంట్ కొన ఆంజనేయకుమార్, ఏపీ క్లాస్-4 ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. మల్లేశ్వరరావు, ఏపీ వీఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి. అనుపమ, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

