ఎన్జీజీవో విజయం - 11 మంది పీహెచ్సీ సిబ్బందిపై సస్పెన్షన్ల ఎత్తివేత
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): డిసెంబరు 3న రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సాయంత్రం 5.30 గంటల తర్వాత అకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా సిబ్బంది అందుబాటులో లేరన్న కారణంతో 12 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం వైద్య ఆరోగ్యశాఖలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చర్యతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
ఈ అంశంపై ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించారు. కమిషనర్‌తో చర్చలు జరిపి, సస్పెన్షన్‌కు గురైన 11 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు జారీ చేయించారు.
ఈ సందర్భంగా ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ ఘన విజయం పూర్తిగా అలపర్తి విద్యాసాగర్ నాయకత్వంలోని ఏపీ ఎన్జీజీవో సంఘానికి దక్కుతుందని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సంఘం చూపిన నిబద్ధతకు ఇది స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సంఘటన ఉద్యోగుల ఐక్యత, సంఘ బలం, సమిష్టి పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. సంఘం వెంటే ఉద్యోగులు ఐక్యంగా నిలబడితే ఏ అన్యాయాన్నైనా ఎదుర్కొని న్యాయం సాధించవచ్చని మరోసారి రుజువైందని తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్ష–ప్రధాన కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డి.వి. రమణలకు గణపవరం పీహెచ్సీ సిబ్బంది తరపున, పల్నాడు జిల్లా మరియు గుంటూరు జిల్లా ఏపీ ఎన్జీజీవో సంఘాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు.

