చైల్డ్ కేర్ లీవ్ సడలింపుపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా, మహిళా ఉద్యోగులు తమ సర్వీస్ కాలం మొత్తం ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునేలా 18 సంవత్సరాల వయస్సు పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం జి.ఓ నం.70 (ఆర్థిక శాఖ)ను 15-12-2025న జారీ చేసింది.
ఈ ఉత్తర్వులపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సుమారు 60 శాతానికి పైగా ఉన్న మహిళా ఉద్యోగులు ఇప్పటివరకు 18 సంవత్సరాల వయస్సు పరిమితి కారణంగా చైల్డ్ కేర్ లీవ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోయారని సంఘం గుర్తు చేసింది. గత ప్రభుత్వంలో జి.ఓ నం.36 (16-03-2024) జారీ అయినప్పటికీ, ఆర్థిక శాఖ ఆమోదం లేక అమలుకాకపోయిందని తెలిపింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్‌ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి పలు వేదికల్లో నిరంతరంగా విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 18-10-2025న ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో మహిళా ఉద్యోగుల తల్లితనానికి గౌరవం పెరిగిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి కె. సంగీతరావు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం కూడా ఈ ఉత్తర్వులను స్వాగతించింది. మహిళా విభాగం ఛైర్పర్సన్ పారేలక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, అసోషియేట్ ఛైర్‌పర్సన్ సైకం శివకుమార్ రెడ్డి, కోశాధికారి డా. సాయిలక్ష్మి ఈ నిర్ణయం లక్షలాది మహిళా ఉద్యోగినులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. సాంకేతిక, ఆర్థిక అభ్యంతరాలు ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖకు, మంత్రివర్గ ఉపసంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు నిబంధనను పూర్తిగా ఎత్తివేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగుల్లో మెజారిటీగా ఉన్న మహిళా ఉద్యోగుల సంక్షేమానికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని ఏపీ జేఏసీ అమరావతి పేర్కొంది.

