వాలిడేషన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి: అఖిల భారత స్టేట్ పెన్షనర్ల సమాఖ్య
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): పెన్షనర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆమోదించిన వాలిడేషన్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిల భారత స్టేట్ పెన్షనర్ల సమాఖ్య డిమాండ్ చేసింది. లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
విజయవాడ నగరంలోని హోటల్ ఐలాపురంలో ఆదివారం ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ల ఫెడరేషన్ (న్యూఢిల్లీ) కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఫెడరేషన్ చైర్మన్ పి.కే. శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెన్షనర్ల హక్కులు, భవిష్యత్‌పై ప్రభావం చూపే వాలిడేషన్ చట్టంపై విస్తృతంగా చర్చించారు.
ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, 2025 మార్చి 25న కేంద్ర ప్రభుత్వం గోప్యంగా వాలిడేషన్ చట్టాన్ని ఆమోదించిందని ఆరోపించారు. ఈ చట్టం అమలులోకి వస్తే 1.1.2026 తర్వాత పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేతన సవరణ కమిషన్ సిఫార్సుల ప్రయోజనాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం వల్ల పెన్షనర్లతో పాటు ఉద్యోగులు, సమాజంపైనా తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో పెన్షనర్లలో అవగాహన పెంచేందుకు త్వరలో దేశవ్యాప్తంగా ‘జన జాగరణ ఉద్యమం’ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణను ఖరారు చేసేందుకు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వాలిడేషన్ చట్టం భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శించారు. గతంలో సీపీఎస్, ఓపీఎస్ పేరిట ఉద్యోగులను విభజించినట్లే, ఇప్పుడు ఓపీఎస్ పెన్షనర్లను విడదీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఐక్య ఉద్యమాలతో దీనిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఎన్నికైతే అన్నిసార్లు పెన్షన్ పొందే అవకాశం ఉన్నప్పుడు, దశాబ్దాలపాటు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులు, పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడంలో వెనకడుగు వేయడం అన్యాయమని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ఎన్ఎల్ శాస్త్రి మాట్లాడుతూ, కేంద్ర సమాఖ్య తీసుకునే ప్రతి కార్యాచరణకు రాష్ట్ర సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి. సుధాకర్, ‘పెన్షనర్స్ వాయిస్’ పత్రిక చీఫ్ ఎడిటర్ ఎస్.ఎస్. దూబే, మాజీ ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే దేశంలోని ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

