*ఉపాధి కల్పనలో ఏపీ-కేవీఐబీ సేవలు భేష్*
• రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
• లక్ష్యానికి మించి పీఎంఈజీపీ యూనిట్ల ఏర్పాటుపై హర్షం
• ఎమ్మెల్యేలతో సమన్వయంతో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు అవకాశం
• స్వయం ఉపాధి రుణాలపై జిల్లాల్లో అవగాహన సదస్సు నిర్వహించండి
• మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయండి
• యువతను పారిశ్రామిత్తవేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యం
• రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుక కృషి : మంత్రి సవిత
**అమరావతి* : యువతకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. స్వయం ఉపాధి యూనిట్ల మంజూరులో స్థానిక ప్రజాప్రతినిధులు, ఏపీకేవీఐబీ అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో ఏపీకేవీఐబీ సీఈవో కె.సింహాచలం, ఇతర అధికారులతో మంత్రి సవిత సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాదిలో ఏపీకేవీఐబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన యూనిట్ల వివరాలను మంత్రి సవితకు ఏపీకేవీఐబీ సీఈవో సింహాచలం వివరించారు. 2025-26లో కేంద్ర ప్రభుత్వం 1,060 యూనిట్ల ఏర్పాటుకు టార్గెట్ పెట్టగా, లక్ష్యానికి మించి 3,595 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు 39.20 కోట్లను మార్జిన్ మనీగా అందించామన్నారు. 3,595 యూనిట్లతో 39,545 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, కొవ్వొత్తుల తయారీ, ఆకులతో కప్పులు, ప్లేట్ల తయారీపై శిక్షణ అందజేస్తున్నామన్నారు. లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయడంపై ఏపీకేవీఐబీ సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఏపీకేవీఐబీ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ (పీఎంఈజీపీ) ద్వారా యూనిట్ల ఏర్పాటుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఏపీకేవీఐబీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని, ఆయా యూనిట్ల ఏర్పాటుపై మీడియా సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై ఆయా సమావేశాల్లో, సదస్సుల్లో వివరించాలన్నారు. సోషల్ మీడియాలోనూ స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఏర్పాటుపై ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిత్త వేత్తను తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఇంతవరకూ యూనిట్ల లబ్ధిదారులతో త్వరలో భారీ సమావేశం నిర్వహిద్దామన్నారు. లబ్ధిదారులు ఏ మేరకు లబ్ధిపొందారో ఆ సమావేశంలో చెప్పడం ద్వారా మరింత మంది యువత పీఎంఈజీపీ యూనిట్ల ఏర్పాటుక ముందుకొచ్చే అవకాశముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి సవిత స్పష్టంచేశారు.
ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి
రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఏపీకేవీఐబీ సీఈవో సింహాచలాన్ని మంత్రి సవిత ఆదేశించారు. అవసరమైతే, తాను కూడా ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడడంలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి, బోర్డు సభ్యులు తిరుపతి కుమార్, సాంబశివరావు, శ్రీనివాసరావు, శిరీష్ దేవి, ఏపీకేవీఐబీ అధికారులు పాల్గొన్నారు.

