విజిలెన్స్ & సెక్యూరిటీ స్టాఫ్ సమస్యలపై చర్చ
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : నగరంలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో విజిలెన్స్ & సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీ పీటీడీ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డి. అంకినీడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ను విజిలెన్స్ & సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ జేఏసీ అమరావతి అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. విజిలెన్స్ & సెక్యూరిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.
డెసిగ్నేషన్ మార్పు, గత పే స్కేల్‌లో కానిస్టేబుల్ కేడర్‌కు జరిగిన అన్యాయం, ట్రావెల్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
ఇటీవల బాపట్లలో జరిగిన 7వ రాష్ట్ర అథ్లెటిక్స్ మీట్‌లో బంగారు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ యన్.పి. రావు, కానిస్టేబుల్ యన్.ఎస్.వి.డి. ప్రసాద్‌లను సభలో అభినందించి సన్మానించారు.
ఈ సమావేశానికి విజిలెన్స్ & సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంతీయ, జోనల్ నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

