*సైబర్ నేరాల కట్టడికి సాంకేతిక నైపుణ్యం, ప్రజా అవగాహనే ఆయుధాలు
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
- సిద్ధార్థ అకాడమీలో 'సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ ఫోరెన్సిక్ సెంటర్' ప్రారంభం
- సైబర్ సెక్యూరిటీ రంగంలో యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో సైబర్ నేరాల ముప్పు కూడా పెరుగుతోందని, దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రజల్లో అవగాహన కూడా చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
సోమవారం విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో, కే.వి. రావు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన "కే.వి. రావు సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ ఫోరెన్సిక్" విభాగాన్ని స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. దేశం డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో బ్యాంకింగ్, ఆరోగ్యం, పాలన వంటి ప్రతి రంగం టెక్నాలజీపై ఆధారపడి ఉందన్నారు. నేరం జరిగిన తర్వాత నిజాన్ని వెలికితీయడానికి డిజిటల్ ఫోరెన్సిక్, నేరం జరగకుండా అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ కీలకమని తెలిపారు.
విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించి దేశ భద్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీస్, న్యాయ వ్యవస్థ, ఐటీ రంగాల్లో సైబర్ నిపుణులకు భారీ డిమాండ్ ఉందన్నారు.
ప్రస్తుతం సైబర్ మోసాలు చాకచక్యంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ గారు సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయడం, ఓటీపీలు (OTP) చెప్పడం, లాటరీల పేరుతో వచ్చే మెసేజ్ లను నమ్మడం వల్ల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు.
ఈ కేంద్రం ద్వారా స్వర్ణాంధ్ర @2047, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు యువత తమ శక్తిని వినియోగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (Distinguished Guest), సిద్ధార్థ అకాడమీ మేనేజ్మెంట్ సభ్యులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

