ఉగ్ర శిబిరాల లక్ష్యాలను ఖచ్చితంగా తాకాం
ఆపరేషన్ సింధూర్ విజయవంతం
పాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడి
భారత్ ధీటుగా సమాధానం చెప్పిందన్న రక్షణశాఖ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సందర్భంగా భారత్ చేపట్టిన ప్రతిఘాత దాడులపై రక్షణశాఖ అధికారులు సోమవారం కీలక విషయాలను వెల్లడించారు. మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఆపరేషన్ విజ్ఞతతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో దాడులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
ఈ సమావేశంలో ఎయిర్‌మార్షల్ ఎకె భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్, డీజీఎంవో రాజీవ్ ఘాయ్ పాల్గొన్నారు. పాక్ సైన్యం, తమపై దాడులు జరిగాయని నెపం వేస్తోందని.. కానీ, భారత్ ఉగ్ర శిబిరాలపై దాడులే లక్ష్యంగా చేసుకుందని అధికారులు స్పష్టం చేశారు. పాక్ వైపు నుంచి వచ్చిన దాడులకు తగిన విధంగా ప్రతిస్పందించామని తెలిపారు.
పాక్‌లో లక్ష్యాలను ఖచ్చితంగా తాకాం
ఈ సందర్భంగా ఎయిర్‌మార్షల్ ఎకె భారతి మాట్లాడుతూ.. ‘‘పాక్, పీఓకేలో జరిగిన ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైంది. ఉగ్ర శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం. పాక్ సైన్యం కలుగజేసుకున్న చోట్ల వారినీ తిప్పికొట్టాం. కరాచీ సమీపంలో ఉన్న కొన్ని కీలక కేంద్రాలపై కూడా మిస్సైల్ దాడులు నిర్వహించాం’’ అని తెలిపారు.
ఆకాశ్, స్వదేశీ పరిజ్ఞానంతో ఘాటు జవాబు
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ క్షిపణి రక్షణ వ్యవస్థను సమర్థంగా వినియోగించామని, పాక్ దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నామని వెల్లడించారు. చైనా తయారైన పీఎల్–15 క్షిపణిని భారత్ భద్రతా వ్యవస్థలు విజయవంతంగా ఆపాయని తెలిపారు.
సివిలియన్ నష్టాలకు అవకాశం ఇవ్వలేదు
‘‘పాక్‌లో సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అత్యంత ప్రతిభావంతంగా ఆపరేషన్ చేపట్టాం. భారత్ ఎప్పటికీ శాంతికి కట్టుబడి ఉంటుంది. కానీ, ఉగ్రవాదంపై పోరాటం విషయంలో ఎప్పుడూ రాజీ పడదు. పాక్ భద్రతా విభాగాలే ఉగ్రవాదులకు అండగా నిలిచిన సందర్భాలలో మాత్రమే మేము సైనికంగా స్పందించాం’’ అని ఎయిర్‌మార్షల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రదర్శించిన వీడియోల్లో పాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడుల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ మరోసారి శత్రువులకు తన బలాన్ని చాటిందని రక్షణవర్గాలు పేర్కొంటున్నాయి.