ఏపీకి కేంద్రం శుభవార్త… దుగ్గరాజపట్నంలో భారీ షిప్ బిల్డింగ్ సెంటర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నంలో అత్యాధునిక నౌకా నిర్మాణ (షిప్ బిల్డింగ్), మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేంద్రం కోసం దాదాపు రూ. 3 వేల కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో—ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు—ఓడల తయారీ, మరమ్మతుల కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అవసరమైన స్థలాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టును షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు.
విదేశీ సంస్థల భాగస్వామ్యంతో షిప్ బిల్డింగ్, రిపేర్ కేంద్రాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ముందుకెళ్తోంది. దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
దేశ నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ. 45,000 కోట్ల వరకు నిధులను కేటాయించింది. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. సముద్ర తీరాన్ని ఉపయోగించి నౌకాయాన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై షిప్ బిల్డింగ్ ప్రాజెక్టుపై సమీక్షించనున్నారు.