దివ్యాంగులకు వెన్నుదన్నుగా నిలుస్తాం : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
ఉపకరణాలు అందించేందుకు అర్హుల గుర్తింపు
దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడం ద్వారా వారికి వెన్నుదన్నుగా నిలవబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకుగాను అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూదోట సునీల్ తోకలిసి ఎమ్మెల్యే నసీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ దివ్యాంగులను, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఎంత కాలం నుంచి సమస్య ఉంది ? ఏ విధంగా అవయవ లోపం ఏర్పడింది ? కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి అధైర్యపడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు . గత ప్రభుత్వంలో దివ్యాంగులకు ఇచ్చిన ఉపకారణాలు వారికి ఉపయోగపడేవి కావని, దీంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొనే వారిని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎలాంటి పరికరాలు అవసరమో గుర్తించి, కొలతలు తీసుకొని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు. ఉపకారణాలు సిద్ధం చేస్తున్న ఆలింకో సంస్థ ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రెండు సెంట్ల స్థలం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇల్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని వెల్లడించారు.
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
గుంటూరులోని జలగం రామారావు హైస్కూల్ లో ఈ నెల 14న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు. జాబ్ మేళా సందర్భంగా ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 50 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.