సొంతూరులో పరిశ్రమలు పెట్టండి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
రొద్దంలో 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి పూజ
ఎంఎస్ఎంఈ పార్కులతో ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్త
ఇదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత
అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు
జగన్ హయాంలో పారిశ్రామికంగా కుంటుపడిన ఏపీ : మంత్రి సవిత
పెనుకొండ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ‘ఎక్కడెక్కడో పరిశ్రమలు ఏర్పాటు చేసే బదులు సొంతూరులో కంపెనీలు పెట్టండి.. మన ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవ్వండి.. మన యువతకు ఉద్యోగిలిచ్చి... రాష్ట్రానికి, దేశానికి ఆదాయం వచ్చేలా సహకరించండి’ అని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, యువతకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. రొద్దంలో 59.37 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి సవిత మంగళవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏపీని పారిశ్రామిక హబ్ గా సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా యువతను వ్యాపారవేత్తలుగానూ తీర్చిదిద్దే మరో బృహత్తుర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి దశలో 50 పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రొద్దంలో 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తొలి దశలో 20 ఎకరాల్లో...
రొద్దం ఎంఎస్ఎంఈ పార్కులో తొలి దశలో 20 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. 115 పరిశ్రమలకు ఏడు సెంట్లు చొప్పున భూ కేటాయింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.7 కోట్లతో రోడ్లు, కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహవంతులైన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, యువకులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు.
సొంతూర్లో పరిశ్రమలు పెట్టండి...
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. ముఖ్యంగా రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఒకవైపు రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూనే, మరో వైపు సాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ పార్కులను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా రూపురేఖలే మారిపోయాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, యువత ఎక్కడో పరిశ్రమలు ఏర్పాటు చేసే బదులు, సొంతూర్లోనే కంపెనీలు ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ పార్కులు ఎంతగానో దోహదపడతాయన్నారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఇతర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు వల్ల వచ్చే ఆదాయం అక్కడి ప్రభుత్వాలకు, ప్రజలకు ఉపయోగపడతుందన్నారు. స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి ఆదాయం...స్థానిక ప్రజలకు, ప్రభుత్వానికి లభ్యమవుతుందన్నారు.
చంద్రబాబు రాకతో పారిశ్రామిక రంగానికి ఊతం
గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేసిందని మంత్రి సవిత మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని, ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి బయటకు పంపించేశారని అన్నారు. జే ట్యాక్స్ చెల్లించాలంటూ పారిశ్రామిక వేత్తలను వేధించారని, ఫలితంగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. దీనివల్ల ఉద్యోగాల్లేక యువత రోడ్డున పడ్డారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు మరోసారి అధికారంలోకి రావడంతో, పారిశ్రామిక రంగానికి ఊతమొచ్చిందని తెలిపారు. ఎందరో బడా పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.