ప్రై"వేటు"పై రాజీ లేని ప్రజా పోరు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
అంబేద్కర్ పాదాల సాక్షిగా ఆత్మాహుతికి సిద్ధం
- వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టిజేఆర్ సుధాకర్‌బాబు
పెత్తందారులకు వరం - పేదలకు శాపం
- మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :నేటి నవీన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. అయితే పెత్తందారులకు కొమ్ము కాసే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా అవి రెండూ పేదలకు అందని ద్రాక్షలా మారాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన పేదలకు మేలు జరిగే వరకు.. ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనే దుర్మార్గమైన వైఖరిని ప్రభుత్వం విడనాడే వరకు.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన ప్రకటించారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొలుత లాడ్జి సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఎస్సీలు బైఠాయించి నిరసన గళం విప్పారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి దళిత ఉద్యమ నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద కుటుంబాల నుంచి కూడా గొప్ప వైద్యులను తయారు చేయాలని.. పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందజేయాలని.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పించినట్లు వెల్లడించారు. ఆ సంకల్ప సిద్ధిలో భాగంగా ఆయన ,తన హయాంలో పెద్ద సంఖ్యలో వైద్యులను తయారు చేసి తద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని 8,500 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. అయితే ఇది సహించలేని చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేయడం వలన వైద్య కళాశాలలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల పరమై రాష్ట్రంలో పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగానే మిగిలిపోతుందని తెలిపారు. అంతే కాక ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు ద్వారా కొన్ని వందల పడకలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రులు వెలిసే అవకాశాన్ని కూడా కోల్పోయినట్లేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఎంత మాత్రం సహించబోమని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటామని లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు.
వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టిజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు రక్షించాల్సిన కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా వాటిని భక్షిస్తోందని భగ్గుమన్నారు. మానవ హక్కులు హరిస్తూ.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఫలితంగా వైయస్ జగన్ హయాంలో సంక్షేమాన్ని చవిచూసిన ఎస్సీలు నేటి చంద్రబాబు పాలనలో సంక్షోభంలో కూరుకుపోయారని ఆరోపించారు. నిరు పేదలైన ఎస్సీలు డాక్టర్లు కావడం ఇష్టం లేకే చంద్రబాబు ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన అంతం కాదిది.. ఆరంభం అని గుర్తుంచుకుని తక్షణమే ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు. లేని పక్షంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాల సాక్షిగా ఆత్మాహుతికి సిద్ధమని సుధాకర్‌బాబు ప్రకటించారు.
మాజీ ఎంపీ, విజయవాడ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు పెత్తందారులకు వరం - పేదలకు శాపం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు వైఖరి చూసి ఎన్టీయార్ విగ్రహాలు కూడా సిగ్గుతో తల దించుకుంటున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న పవన్ కల్యాణ్ "రీల్ హీరో - రియల్ జీరో" అని ఎద్దేవా చేశారు.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ, పేద విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదవడమే పాపంగా భావించే చంద్రబాబు, వారు డాక్టర్లు కావడం తట్టుకోలేకే ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కళాశాలలను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెనాలి నియోజకవర్గం సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, దేశంలో ఏ పాలకుడైనా పోరాడి మరీ మెడికల్ కాలేజీలు సాధించుకుంటారు కానీ.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం తన హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేకపోయారని విమర్శించారు. పైపెచ్చు వైయస్ జగన్ తెచ్చిన కళాశాలలను ప్రైవేటీకరించడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ, పీపీపీ విధానం అంటూ అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటుకు అమ్ముకోవడం ద్వారా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడమే చంద్రబాబు విజన్ అని మండిపడ్డారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ, పేదవాడు డాక్టర్ కావాలన్న కలని నిజం చేసి, పేదవాడు డబ్బులకు ఇబ్బంది పడకుండా వైద్యం అందాలన్న వైయస్ జగన్ సంకల్పానికి తూట్లు పొడిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాపతోటి అంబేద్కర్, దూపాటి వంశీ, బోడపాటి కిషోర్, ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), గేదెల రమేష్, పూనూరి నాగేశ్వరరావు, గులాం రసూల్, మస్తాన్‌వలి, పరిశపోగు శ్రీనివాసరావు, బత్తుల దేవానంద్, మండేపూడి పురుషోత్తం, పానుగంటి చైతన్య, షేక్ రబ్బానీ, పేటేటి నవీన్, గుంటూరు ఈస్ట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అంకాల రాజు, మంగళగిరి అధ్యక్షుడు భూషణం, తెనాలి అధ్యక్షుడు అవీష్, తాడికొండ అధ్యక్షుడు రాజు, ప్రత్తిపాడు అధ్యక్షుడు పున్నారావు, ఆలా కిరణ్, రాచకొండ రాజు, కానూరు శశి, దినేష్, ప్రసన్న, మాదాసు భాగ్యారావు, జంగం దాసు తదితరులు పాల్గొన్నారు.