'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !
పీహెచ్సీ వైద్యుల డిమాండ్ల నేపథ్యంలో పీజీ ఇన్సర్వీస్ కోటాలో ఈ ఏడాదికి 20% సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఆదివారం విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో ఆందోళనలో ఉన్న పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చించారు.
వీరపాండియన్ మాట్లాడుతూ,“ప్రభుత్వం 15% కోటాను 20%కు పెంచుతూ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు త్వరలో జారీ అవుతాయి. వెంటనే విధుల్లో చేరాలని కోరుతున్నాను,” అని పేర్కొన్నారు. అయితే, ఈ కోటాను 2030 వరకు కొనసాగించాలని వైద్యులు పట్టుబడగా, తదుపరి సంవత్సరాల్లో ఈ కోటాను ఎలా అమలు చేయాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేసి, విధానపరమైన నిర్ణయాన్ని వచ్చే నెలలోగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబరు నుంచి 2027 నవంబరు మధ్య కలిపి 1,089 మంది పీజీలు తిరిగి విధుల్లోనికి వస్తారు. వీరు జిల్లా, ప్రాంతీయ, సామాజిక, బోధనాసుపత్రుల్లో నియామకాలు చేపట్టినప్పుడు స్పెషాలిటీ వైద్యులుగా చేరతారు. అందుకు తగ్గ ఖాళీలు ఉండని పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్ -సర్వీస్ కోటా ఎలా ఉండాలన్న దానిపై చర్చించేందుకు తగిన వ్యవధి అవసరం. వైద్యులు అర్థం చేసుకోవాలి అని కోరినప్పటికీ, పీహెచ్సీ వైద్యుల సంఘం నేతలు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు .
ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించడం సమంజసం కాదని వైద్యుల ఆవేదన
చర్చలకు వెళ్లిన పీహెచ్సీ వైద్యుల సంఘం నేతల తీరుపై వైద్యులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు “ఈ ఏడాదికి 20% సీట్లు కేటాయింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని,అందుబాటులో 103 పోస్టులు ఉంటే,258 మందికి ప్రయోజనం కలిగించిందని అయినప్పటికీ రానున్న సంవత్సరాలపై ఇప్పుడే నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేయడం అర్ధరహితం అని పీహెచ్చీ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న సంవత్సరాల ఇన్సర్వీస్ కోటా భవిష్యత్తుపై రాబోయే నెలలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం అంత స్పష్టంగా, సమంజసంగా పేర్కొన్నప్పటికీ, ఏదో కొంపలు ఇప్పుడే మునిగి పోతున్నట్లుగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పడం మూర్ఖత్వంగా వైద్యులు విమర్శిస్తున్నారు. కేవలం అనుభవరాహిత్యం , ప్రభుత్వ విధి విధానాలపై అవగాహన లేకపోవడం, పీహెచ్సీ వైద్యుల సంఘానికి సరైన నిర్మాణం లేని కారణంగా చర్చలకు వెళ్లిన సంఘం నేతలు మూర్ఖమైన ప్రకటన చేశారని, ఈ ప్రకటనతో తమకు సంబంధం లేదని , తాము ఆందోళన విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ వర్గం వైద్యులు విభేదిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం అత్యంత సమంజసంగా ఉంది : ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం
రాష్ట్రంలో వివిధ విభాగాల ప్రభుత్వ వైద్యులకు సంఘాలు ఉన్నప్పటికీ, ఈ సంఘాలన్నింటికీ కేంద్రీకృత సంఘంగా వ్యవహరించే 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం' రాష్ట్ర కమిటీ దృష్టికి పీహెచ్సీ వైద్యుల సంఘం వైఖరిని అసంత్రుప్త పీహెచ్సీ వైద్యులు ఆదివారం తీసుకువెళ్ళారు. ప్రభుత్వ నిర్ణయం తమకు సంతృప్తి కలిగించిందని, ఇక తమకు ఆందోళనలో పాలు పంచుకోవడం ఇష్టం లేదని, తాము విధుల్లో చేరుతామని, తమకు మద్దతుగా నిలవమని కోరారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కమిటీ ... తాము జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉన్నామని, మాకున్న అనుభవం మేరకు, ప్రభుత్వ నిర్ణయం అత్యంత సానుకూలంగా, సమంజసంగా ఉందని భావిస్తున్నామని పేర్కొన్నారు. సమంజసమైన నిర్ణయాలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఇటీవలే ప్రధానమంత్రి మోదీ , మరో పది వేల ఎంబీబీఎస్ సీట్లు, ఆరు వేల పీజీ సీట్లు పెంపుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని , అదే జరిగితే ప్రభుత్వం అందిస్తున్న ఈ 15%-20% సీట్లతోనే పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. రానున్న సంవత్సరాల్లో ఈ ఇన్ సర్వీస్ సీట్ల కేటాయింపుకు సంబంధించిన ఈ విషయాలన్నింటిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకే ప్రభుత్వం నెల గడువు కోరినట్లుగా తాము భావిస్తున్నామని, ఇందులో తప్పేమీ లేదని లేదన్నారు. మనం డిమాండ్ చేశామనో, ఆందోళన చేశామనో ... ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయకుండా నిమిషాల వ్యవధిలో నిర్ణయం ఎప్పుడూ తీసుకోదని, ప్రతి డిమాండ్ పై ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేసి భవిష్యత్తు పరిణామాలు అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారని, ఇవ్వన్ని అనుభవంతోనే అర్ధమవుతాయని అన్నారు .
పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటా పెంపుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవ తీసుకుని... ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపి, 15%కు బదులు 20% సీట్లను పీజీ ఇన్ సర్వీస్ కోటాలో కేటాయించేందుకు అంగీకారం తెలిపారు. కేవలం మంత్రి చొరవ కారణంగానే ఈ పెంపు సాధ్యమైంది. ఇటువంటి సందర్భంలో సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ధన్యవాదాలు తెలపడం పరిపక్వతగా ఉంటుందని 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం' రాష్ట్ర నేతలు అభిప్రాయపడ్డారు.
103 పోస్టులకు పైగా – 258 మందికి ప్రయోజనం : కమిషనర్ వీరపాండియన్
ఇన్సర్వీస్ కోటా అమలుపై నిపుణుల కమిటీ చేసిన అధ్యయనంలో బోధనాసుపత్రుల్లో 100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, సెకండరీ హెల్త్ డైరెక్టరేట్లో మూడు పోస్టులు మాత్రమే ఉన్నట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. అయితే వైద్యుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి 15% బదులు 20% కోటాను అమలుచేస్తోంది. దీంతో ఈ ఏడాది 103 పోస్టులకు బదులు 258 మంది వైద్యులు లబ్ధి పొందనున్నారు.
రోగులకు వైద్యసేవలు నిరంతరంగా అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని వీరపాండియన్ స్పష్టం చేశారు. “భవిష్యత్తులో ఖాళీ అయ్యే పోస్టుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇన్సర్వీస్ కోటా అమలు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. మొదట 7 క్లినికల్ స్పెషాల్టీల్లో 15% కోటా కింద సీట్లు ఇవ్వాలని నిర్ణయించినా, వైద్యుల విజ్ఞప్తి మేరకు దానిని 20%గా మార్చాం,” అని వివరించారు.
డైరెక్ట్ పీజీ వైద్యుల అవకాశాలపై ప్రభావం
ఇన్సర్వీస్ కోటా పెంపుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేయాలనుకునే డైరెక్ట్ పీజీ వైద్యులకు అవకాశాలు తగ్గుతున్నాయని వీరపాండియన్ పేర్కొన్నారు. “వైద్యుల నియామక నోటిఫికేషన్లలో ఇన్సర్వీస్ కోటా వివరాలు పొందుపరచలేదు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది,” అని తెలిపారు.