అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన

అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన

- విద్యార్థుల ఏకైక లక్ష్యం కావాలన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) :  "విద్యార్థులు ముందు చదువుకోవాలి.. విద్య ద్వారానే ఎవరి జీవన స్థితిగతుల్లో అయినా సమూల మార్పు వస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.. అదే సమయంలో చదువుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలపై ఎలుగెత్తి పోరాడాలి..  అప్పుడే అందరికీ విద్య అందుబాటులోకి వచ్చి సమాజంలో పేదరికపు చిమ్మ చీకట్లు తొలగి, ప్రగతి కాంతులు విరబూస్తాయి" అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గారు వ్యాఖ్యానించారు.

బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను కూడా మీలాగే చిన్న కుటుంబం నుంచి విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించినట్లు చెప్పారు. మిమ్మల్ని చూస్తుంటే తాను విద్యార్ధి నాయకుడిగా గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. పానుగంటి చైతన్య కూడా మీలాగే విద్యార్ధి రాజకీయాలలో ప్రవేశించి, అవకాశాలను అందిపుచ్చుకుని, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. మీరంతా ఆకాశమే హద్దుగా తన పట్ల చూపిస్తున్న అనంతమైన ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు తోడబుట్టిన తమ్ముళ్లు లేని లోటే తెలియడం లేదన్నారు. రక్తం పంచుకుని పుడితే తనకు మహా అయితే ఒక అన్నో.. ఒక తమ్ముడో.. ఉండే వారనీ.. కానీ ఇప్పుడు కులమేదైనా.. మతమేదైనా.. ప్రాంతం ఏదైనా.. మీతో ఏర్పడిన అనుబంధం జన్మజన్మలకూ విడదీయరానిదని స్పష్టం చేశారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాం విద్యార్థులకు స్వర్ణ యుగమని లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పధకంతో అందరికీ ఉన్నత విద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేసి మొత్తం విద్యారంగంలోనే విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నాడు - నేడు, ఇంగ్లీషు మీడియంలో విద్య వంటి అనేక కార్యక్రమాలతో సమూలమైన మార్పులు తెచ్చినట్లు వివరించారు. అయితే ప్రస్తుత పాలకులు ఫీజు రీయంబర్స్‌మెంట్‌‌ను పూర్తిగా అటకెక్కించి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్ధి వ్యతిరేక విధానాలతో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని నిందించారు. 

తాజాగా వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి సాధించి పెట్టిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే దుశ్చర్యకు దిగజారారని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ అన్యాయంపై ప్రధానంగా పాలకులను ప్రశ్నించాల్సిన బాధ్యత విద్యార్ధులపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు గళమిప్పితే లోకమే మారిపోతుందని.. ఇక ఈ కూటమి ప్రభుత్వం ఒక లెక్క కాదన్న సత్యాన్ని మరోమారు సమాజానికి చాటి చెప్పాల్సిన సమయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. దానికి తొలి మెట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థుల తరుపున రాష్ట్ర వ్యాప్తంగా రాజీ లేని పోరాటానికి సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు సంపూర్ణ మద్ధతుగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వినోద్, రీజనల్ కో ఆర్డినేటర్ విఠల్, విద్యార్ధి నేతలు బాజి, రవి, జగదీష్, రాజేష్, అజయ్, కరీం, కిరణ్, సాదిక్, వినేష్, అరుణ్, హోసన్న, ప్రభు, యష్, సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News