స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి
అమరావతిిి(జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం భవిష్యత్తులో మరింత విజయవంతం కావాలంటే మహిళా ప్రయాణీకులపై విధిస్తున్న గుర్తింపు కార్డు నిబంధనలను తొలగించాలని ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఈ మేరకు లేఖ అందజేశారు.
స్త్రీశక్తి పథకం సమర్థవంతంగా అమలుకావాలంటే మరో మూడు వేల బస్సులను పెంచి, పదివేల మంది సిబ్బందిని నియమించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. మహిళా ప్రయాణీకులలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు స్వల్పసంఖ్యలోనే ఉన్నందున, ఆధార్ కార్డు తదితర గుర్తింపు పత్రాల నిబంధనలు తొలగిస్తే కండక్టర్లపై పనిభారం తగ్గడమే కాకుండా, మహిళా ప్రయాణీకులలో కూటమి ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుందని తెలిపారు.
ప్రభుత్వ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై కూడా లేఖలో ప్రస్తావించినట్లు చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలనీ, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించాలనీ, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారంతో కూడిన మొత్తం పది డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
ఈ విషయాన్ని ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య, ఉప ప్రధాన కార్యదర్శి యం.డి. ప్రసాధ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

