బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
13.8 లక్షల చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లల పోషకాహార లోపాలను నివారించేందుకు 13.80 లక్షల మంది చిన్నారుల పోషక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న ‘బాలామృతం’ పథకం ఇప్పుడు అధికారుల తీరు కారణంగా తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. అత్యంత సున్నితమైన న్యూట్రిషన్ పౌడర్ తయారీకి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ విధించిన టెండర్ నిబంధనలపై నిపుణులు, ప్రజా సంఘాలు, పోషకాహార రంగ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో రూ.1,200 కోట్లకు పైగా వ్యయం కానున్న ఈ పథకంపై ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చిన్నారుల ఆరోగ్యంతో ప్రయోగాలు చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సున్నితమైన న్యూట్రిషన్ పౌడర్ తయారీకి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ విధించిన టెండర్ నిబంధనలు చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఐదేళ్లలో రూ.1,200 కోట్ల మేర ప్రజాధనం వ్యయమయ్యే ఈ పథకాన్ని అత్యంత జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
8 నెలల్లో యూనిట్ నిబంధన...పిల్లల ఆరోగ్యంతో చెలగాటం
హార్లిక్స్ వంటి న్యూట్రిషన్ పౌడర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి హిందుస్థాన్ యూనిలీవర్ వంటి దిగ్గజ సంస్థలకు దాదాపు ఐదేళ్లు పట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితిలో, ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసు పిల్లలకు అందించే బాలామృతం తయారీకి కేవలం 8 నెలల్లోనే కొత్త యూనిట్ ఏర్పాటు చేసి సరఫరా ప్రారంభించాలని నిబంధన విధించడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక నాణ్యతా పరీక్షలు, శాస్త్రీయ ప్రమాణాలు, భద్రతా జాగ్రత్తలు అవసరమైన ఈ ఉత్పత్తిని ఇంత తక్కువ వ్యవధిలో సిద్ధం చేయడం పిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. టెండర్ పొందిన సంస్థ కేవలం ఎనిమిది నెలల్లోనే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేసి సరఫరా ప్రారంభించాలన్న నిబంధనను విధించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఇంత స్వల్ప వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించడం పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమేనని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ల అర్హతలపై విమర్శలు
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి బాలామృతం సరఫరా కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ సెప్టెంబరులో టెండర్లు పిలిచింది. ఏడాదికి సుమారు రూ.240 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ఐదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. అయితే టెండర్లలో నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు పేరున్న, అనుభవజ్ఞులైన న్యూట్రిషన్ పౌడర్ తయారీ సంస్థలను పోటీ నుంచి తప్పించేందుకే రూపకల్పన చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
న్యూట్రిషన్ పౌడర్ లేదా హెల్త్ మిక్స్ తయారీలో అనుభవం లేని సంస్థలకు కూడా అవకాశం కల్పించడం ద్వారా శిశువుల ఆరోగ్యంతో రాజీ పడుతున్నారని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగి పిండి, మల్టీగ్రెయిన్ అటా, అటుకులు, పల్లీ చిక్కీ, హాట్ కుక్ మీల్ వంటి పూర్తిగా భిన్నమైన ఉత్పత్తులు సరఫరా చేసే సంస్థలకు ఈ కీలక బాధ్యత అప్పగించాలన్న ప్రయత్నాలు అనుమానాలకు తావిస్తున్నాయి.
బాలసంజీవని కాంట్రాక్టర్లకే కట్టబెట్టే యత్నమా?
ఇప్పటికే గర్భిణీలకు ‘బాలసంజీవని’ సరఫరా చేస్తున్న కొన్ని సంస్థలకే బాలామృతం టెండర్లు కూడా కట్టబెట్టేలా నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన న్యూట్రిషన్ ఉత్పత్తులను వినియోగిస్తున్న రాష్ట్రం, ఇప్పుడు ఏపీ సరఫరాదారులతో ఈ ప్రక్రియ చేపట్టాలనుకుంటే ఎంపిక విధానం మరింత కఠినంగా ఉండాల్సిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ అందుకు భిన్నంగా, అనుభవం లేని చిన్న సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.
ఐదేళ్ల అనుభవం తప్పనిసరి కావాలంటున్న నిపుణులు
ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సున్న చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను నివారించేందుకు అందించే బాలామృతం అత్యంత శాస్త్రీయంగా తయారయ్యే ఉత్పత్తి. కనీసం ఐదేళ్ల న్యూట్రిషన్ పౌడర్/మాల్ట్ ఆధారిత ఉత్పత్తుల తయారీ అనుభవం ఉన్న సంస్థలకే టెండర్లలో అర్హత కల్పించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన బాలామృతం అందుతుందన్నది వారి వాదన.
పారదర్శకత ఎందుకు కనిపించడం లేదు?
రూ.వేల కోట్ల ప్రజాధనం వెచ్చిస్తున్న ఈ పథకంపై ఇంత తొందరపాటు నిర్ణయాలు ఎందుకు? చిన్నారుల ఆరోగ్యంతో ప్రయోగాలు చేయడం సమంజసమేనా? టెండర్ నిబంధనల రూపకల్పనలో పారదర్శకత ఎందుకు కనిపించడం లేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో ముదిరిపోతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే, బాలామృతం పథకం చుట్టూ వివాదాలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.

