ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వంటి ప్రజాహిత పథకానికి వ్యక్తిగతంగా 50 వేల రూపాయల విరాళం ప్రకటించడం ద్వారా ఏపీఎన్జీజీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా మాత్రమే కాకుండా, పేదల ఆకలి తీర్చే కార్యక్రమాల పట్ల స్పందించే మనసున్న వ్యక్తిగా ఆయన మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. సమాజ హితం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఆయనలాంటి నాయకులు మరింత మందికి ప్రేరణగా నిలవాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ఏపీఎన్జీ జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘంటసాల శ్రీనివాసరావు చెక్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పథకం పేదలు, నిరుపేదలు, కూలీలు, అవసరమున్నవారికి ఆహార భద్రత కల్పించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని పేర్కొన్నారు. సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రజాహిత పథకాలకు తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఉద్యోగ సంఘ నాయకుడిగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఘంటసాల శ్రీనివాసరావు చేసిన ఈ విరాళం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల నుంచి ఇలాంటి స్వచ్ఛంద సహకారం మరింత పెరగాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీ జీవో రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

