సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సమర్థంగా ప్రతినిధ్యం వహించే బాధ్యతాయుత పాత్రను ఆయన నిర్వర్తించాలని ఆకాంక్షించారు.ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు రామకృష్ణతో పాటు సంఘానికి చెందిన ఇతర సభ్యులు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతనంగా ఎన్నికైన సంఘం కార్యవర్గాన్ని అభినందించారు. సచివాలయ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం రామకృష్ణ చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా వ్యవస్థ బలోపేతంలో సచివాలయ సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు.సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఉద్యోగులు–ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచుతూ పరిపాలనా వ్యవస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.నూతన కార్యవర్గంతో కలిసి సచివాలయ సంఘాన్ని మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లే దిశగా రామకృష్ణ నాయకత్వం కీలకంగా ఉండనుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


