శ్రీశైలంలో భక్తిశ్రద్ధలతో మల్లమ్మ జయంతి
శ్రీశైలం ( జర్నలిస్ట్ ఫైల్ ) : శ్రీశైల మల్లికార్జునస్వామి భక్తులలో ప్రముఖురాలైన హేమారెడ్డి మల్లమ్మ జయంతి వేడుకలు వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం మల్లమ్మ మందిరంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. గోశాల సమీపంలో ఉన్న మల్లమ్మ కన్నీరు మందిరంలో జరిగిన ఈ జయంత్యోత్సవంలో పంచామృతాభిషేకం, జలాభిషేకం, అర్చన, స్తోత్ర పారాయణలు, భక్తిగీతాల ఆలాపన విశేషంగా జరిగాయి.కార్యక్రమంలో ప్రారంభంగా జయంత్యోత్సవ సంకల్పం పఠించగా, అనంతరం మహాగణపతి పూజతో ప్రారంభ వేళాశుభత కోసం ప్రార్థనలు చేశారు. మల్లమ్మకు భక్తి భావంతో అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.హేమారెడ్డి మల్లమ్మ చరిత్రపై ఆలయ అధికారులు తెలిపారు. తల్లిదండ్రులకు సంతానమిలేక మల్లికార్జునస్వామిని ఆరాధించిన దంపతులకు స్వామి కలలో దర్శనమిచ్చి కుమార్తె లభిస్తుందని వరమిచ్చినట్టు చరిత్ర చెబుతోంది. ఆ అనుగ్రహంతో జన్మించిన మల్లమ్మ చిన్నతనంనుంచి స్వామివారిపై అపారమైన భక్తి చూపేది.వివాహానంతరం అత్తింట్లో ఆస్తులు పెరగడంతో తోటి బంధువుల అసూయను ఎదుర్కొంది. ఎన్నో కష్టాలు ఎదురైనా భక్తితో ముందుకెళ్లిన మల్లమ్మకు స్వామివారి అనుగ్రహం ఎప్పటికప్పుడు కలిగింది. చివరికి భర్త చేతితో ప్రాణాపాయం ఏర్పడిన వేళ మల్లికార్జునస్వామి మహిమతో ఆమెకు రక్షణ లభించింది. అనంతరం మల్లమ్మ వైరాగ్యాన్ని అలవాటు చేసుకుని శ్రీశైలానికి చేరి భక్తులకు శివతత్వాన్ని బోధిస్తూ చివరకు శివసాయుజ్యం పొందినట్టు పురాణకథనం చెబుతోంది.జయంతి సందర్భంగా జరిగిన విశేషపూజల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.