శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం
జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం వీటిని తిరిగి తెరచారు.
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌ను సోమవారం తెరిచినప్పటికీ, విమాన కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు తొలి విమానం ఎయిర్ ఇండియాకు చెందిన AI 827, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు చేరుకుంది. ఆరు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో మూసివేసిన 32 విమానాశ్రయాలు తిరిగి తెరిచినట్టు భారత విమానయాన నియంత్రణ సంస్థ సోమవారం ప్రకటించింది. శ్రీనగర్, ఛండీగఢ్, అమృత్‌సర్‌లో విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. ప్రయాణికులు విమానాల స్టేటస్ కోసం ఆయా ఎయిర్‌లైన్స్‌తో లేదా వారి వెబ్‌సైట్‌ల ద్వారా సమాచారం పొందాలని ఏఏఐ సూచించింది.