వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్
అన్ని విధాల అండగా ఉంటానని భరోసా
ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ పటిష్టత కోసం కృషిచేసిన వీరయ్య చౌదరి దారుణహత్య బాధాకరమని అన్నారు. హత్య నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహ రెడ్డి, బిఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.