కొండపాటూరులో.. మన హైస్కూల్లోనే చదివిద్దాం స్పెషల్ డ్రైవ్ !
ప్రయివేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు
కొండపాటూరు హై స్కూల్ లొ అడ్మిషన్ ల కొరకు సమిష్టి కృషి
కాకుమాను, (జర్నలిస్ట్ ఫైల్ ):గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరుకు హైస్కూలు మంజూరైన సందర్భాన్ని పురస్కరించుకుని పరిస్థితులను పరిశీలించడానికి కాకుమాను మండల విద్యాశాఖ అధికారి 2 విజయభాస్కర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామ పెద్దల పట్టుదల వల్లనే హైస్కూలు మంజూరు అయిందని వారికి ఆయన అభినందనలు తెలిపారు. గ్రామస్తుల సంపూర్ణ సహకారం కూడా ఉన్నందువల్ల నూతన హైస్కూలు ఫలప్రదం అవుతుందని పేర్కొన్నారు. బుధవారం రాత్రి పది గంటల వరకు గ్రామ పెద్దలు తలపెట్టిన మన హైస్కూల్లోనే మన పిల్లలను చదివిద్దాం అనే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో విజయభాస్కర్ చివరి వరకు పాల్గొన్నారు. కొండపాటూరు హైస్కూల్లో చేరడానికి గతంలో హామీ ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను మరోసారి కలసి ఒప్పందం విషయం గుర్తు చేయడానికి గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున వీధివీధి తిరిగారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో విజయభాస్కర్
మాట్లాడుతూ బీఈడీ చేసిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ హైస్కూల్లో ఉన్నారని, మరి కొందరు కూడా రానున్నారని చెప్పారు. అందువల్ల ప్రతి సబ్జెక్టుకు ఒక టీచరు, ఐదో తరగతి వరకు ప్రతి క్లాసుకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారని తెలిపారు.
రానున్న విద్యా సంవత్సరం నుంచే పదో తరగతి వరకు క్లాసులు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ప్రయివేటు స్కూళ్లలో చాలా వరకు క్వాలిఫైడ్ టీచర్లు లేరని, వారితోనే చదువులు చెప్పిస్తున్నారని తెలిపారు. ప్రయివేటు స్కూళ్ల మోజులో డబ్బులు వృధా చేసుకోనవసరం లేదని, అంతకంటే నాణ్యమైన ఉచిత విద్య తమ గ్రామం లోనే హైస్కూల్లో అందనుందనే విషయం ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని విజయభాస్కర్ సూచించారు.
పది రోజుల్లో ఆటస్థలం సిద్ధం
భవిష్యత్తు తరాలవారికి విద్యాబుద్ధలు నేర్పనున్న హైస్కూలుకు అందరు సహకారం అందజేయాలని గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యార్లగడ్డ అంకమ్మ చౌదరి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. చెరువుకు తూర్పున గల తమ స్థలాన్ని హైస్కూలు ఆటస్థలానికి ఇస్తున్నట్లు వారికి తెలిపారు. అందులో 50 ట్రక్కుల మట్టితోలి మెరక చేయించి వారం పది రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. పాఠశాల అయ్యాక మరో గంట విద్యాబోధన సాగేలా ఏర్పాటు చేయిస్తామని హామీఇచ్చారు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కొండపాటూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఎంచుకుని, నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని అంకమ్మ చౌదరి సూచించారు.
ఎందరున్నా ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం "తల్లికి వందనం" పేరుతో కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నా, ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తుందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది ఒక వరమని సీనియర్ జర్నలిస్ట్ టి.డి.ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ఉచితంగా మూడు జతల కొత్తగా రూపొందించిన యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్ట్ షూలు, బ్యాగు తదితరాలను అందిస్తారని చెప్పారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఉపయోగించనుందని ప్రసాద్ వివరించారు.
అడ్మిషన్ ఫారాలపై సంతకాలు చేసి ఇచ్చిన తల్లిదండ్రులు
మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక సమావేశం నిర్వహించి తమ గ్రామ స్కూల్లో చదివితే జరిగే ప్రయోజనాలు వివరిస్తూ గ్రామంలో ఆటో ద్వారా విస్తృతంగా మైకు ప్రచారం చేయించాలని సూచించారు. గతంలో అంగీకారం తెలిపిన ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది అడ్మిషన్ ఫారాలపై సంతకాలు చేసి తమకు ఇవ్వడం ఆనందంగా ఉందని హైస్కూలు టీచర్లు రవికుమార్, ప్రకాశరావు, ప్రమీలాదేవి తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామపెద్దలు గన్నపనేని రాఘవరావు, గన్నపనేని వెంకటేశ్వరరావు, చుండూరు గాంధీ, కోడూరి అంకినీడు, తరిగోపుల సురేంద్ర, తమలపాకుల సుబ్బారావు, మామిడి అనిల్ తదితరులు పాల్గొన్నారు.