వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :: ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (384/2022) ప్రతినిధులు పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ చల్లా అనురాధను ఈ రోజు వడ్డేశ్వరం లోని పురపాలక శాఖ ప్రధాన కార్యాలయంలో కలిసి వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్, ప్రధాన కార్యదర్శి శిస్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో విడుదల చేసిన జీవో 523 ను రద్దు చేసి, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతికి తగిన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ లేదా అంతకన్నా ఉన్నత స్థాయి చానల్‌ను రూపొందించాలని కోరారు.
వార్డు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్యదర్శులకు సంక్షేమ శాఖల్లో పదోన్నతుల అవకాశాలు కల్పించాలని, మెప్మాలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు లేదా కమ్యూనిటీ ఆర్గనైజర్లుగా నియమించాలని సూచించారు. అలాగే, కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబర్ వెల్ఫేర్ అధికారులుగా, వైద్య శాఖలో మెడికో సోషల్ వర్కర్లుగా, కోఆపరేటివ్ సొసైటీల్లో అవకాశాల కోసం చర్యలు తీసుకోవాలని, వీరి పనిని సమీక్షించే అధికారి నియామకాన్ని కోరారు.
వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులకూ సంబంధించి, వీరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో జూనియర్/సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వాలని, ఎడ్యుకేషన్ విభాగాన్ని వీరి నుండి తొలగించవద్దని, మునిసిపల్ శాఖలో ఐటీ విభాగం ఏర్పాటు చేసి టెక్నికల్ పోస్టులుగా గుర్తించాలన్నారు. ఆధార్ ఆపరేటర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని, టెక్నికల్ పే స్కేల్ వర్తింపచేయాలని, విద్యాశాఖలో విలీనం చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.