ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం: అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని బేరౌ
పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తలెత్తింది. పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఓటమి చెందడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. దీంతో కేవలం 12 నెలల్లోనే ఫ్రాన్స్ నాలుగో ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓటింగ్‌లో ఘోర పరాజయం
గతేడాది డిసెంబర్‌లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించిన బేరౌకు వ్యతిరేకంగా 364-194 ఓట్ల తేడాతో మెజారిటీ లభించింది. దీంతో ఆయన అధికారాన్ని కోల్పోయారు.
ఆర్థిక ఒత్తిడిపై అవిశ్వాస తీర్మానం
ఫ్రాన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై స్వయంగా బేరౌనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన ప్రణాళికలకు మద్దతు ఇవ్వాలని జాతీయ అసెంబ్లీలో సభ్యులను కోరినా ఫలితం లేకపోయింది. అప్పుల భారం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని ఆయన హెచ్చరించారు.
“వాస్తవం తుడిచిపెట్టలేరు”
“ప్రభుత్వాన్ని కూల్చే శక్తి మీకు ఉంది.. కానీ వాస్తవాన్ని తుడిచిపెట్టే శక్తి లేదు” అని అసెంబ్లీలో బేరౌ పేర్కొన్నారు. అయినా, ఆయన ప్రభుత్వానికి మద్దతు లభించకపోవడంతో ఫ్రాన్స్ మళ్లీ నాయకత్వ సంక్షోభంలోకి జారుకుంది.