నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా
కాఠ్‌మాండూ: నేపాల్‌లో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియా నిషేధంతో ప్రారంభమైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ పరిణామాల మధ్య నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నారని సమాచారం. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా అల్లర్లు ఆగకపోవడం గమనార్హం.
అవినీతి నిర్మూలన కోసం విద్యార్థులు, యువత భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చారు. కాఠ్‌మాండూ సహా అనేక జిల్లాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిపారు. ఆందోళనకారులను అణిచివేసేందుకు భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘర్షణల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికే పలువురు మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి లేఖక్ తన పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ప్రధాని ఒలీ రాజీనామాతో నేపాల్ పగ్గాలు తాత్కాలికంగా సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.