భారత్‌పై పాక్ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండన
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్ దాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ, పలు అనుకూల ఎక్స్ హ్యాండిళ్ల ద్వారా ఒకే తరహా పోస్టులు షేర్ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ పాక్ అసత్య ప్రచారం మొదలుపెట్టింది. సైన్యం యుద్ధ సామగ్రి అప్‌గ్రేడ్‌కు వ్యతిరేకమని, పాక్‌తో వివాదం వద్దని పేర్కొంటూ పలు పోస్టులు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అప్రమత్తమై స్పందించింది. ఆ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తూ, ఇలాంటి అసత్య ప్రచారాలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే అనేకసార్లు ఫేక్ న్యూస్
ఆపరేషన్ సిందూర్ తరువాత కూడా పాక్ పలు నకిలీ కథనాలను ప్రచారం చేసింది. భారత అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400ను జేఎఫ్-17 యుద్ధవిమానంతో కూల్చేశామని పాక్ ప్రభుత్వ మీడియా పీటీవీ కథనాలు ప్రచురించింది. అయితే వెంటనే భారత సైన్యం దీనిని తిప్పికొట్టింది. హైపర్‌సోనిక్ క్షిపణితో ఎస్-400ను ధ్వంసం చేశామన్న పాక్ వాదన వాస్తవం కాదని స్పష్టం చేసింది. అంతేకాక, భారత మహిళా వాయుసేన పైలట్ పాక్ బలగాలకు చిక్కారన్నది, పవర్‌గ్రిడ్ 70% దెబ్బతిన్నదన్నది కూడా పూర్తిగా కల్పితమని కొట్టిపారేసింది.
పాక్ తరచూ చేస్తున్న ఈ నకిలీ ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ మళ్లీ హెచ్చరించింది.