రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా
యూరియా సరఫరాపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యూరియాను శాస్త్రీయంగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పౌర సేవల మెరుగుదలకు ప్రతీవారం సమీక్షలు నిర్వహించమని సీఎం సూచించారు.
ఏపీలో 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు
కాకినాడ పోర్టుకు వచ్చిన నౌకలో 7 రేక్ ల యూరియా కేటాయింపు
రబీ సీజన్ కు కూడా ముందస్తు ప్రణాళిక చేయాలన్న ముఖ్యమంత్రి
యూరియా సరఫరా,ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ చేశారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో ఎరువుల సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు, కాఫీ పంటలకు సోకిన తెగులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మూడు గంటలపాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపుపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఇవాళ కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని 7 రేక్‌ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి తక్షణమే రాష్ట్రానికి ఆ యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రానికి అదనంగా మరో 50 వేల మెట్రిక్ టన్నుల కేటాయించినట్లైంది. వచ్చే రబీ సీజన్‌కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువుల పంపిణీకి సంబంధించి భరోసా ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు, కౌలు రైతులు ఎరువులు దొరకవనే ఆందోళనతో ఒకేసారి కొనుగోలు చేయకుండా.. నిల్వచేసి పెట్టుకోకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. అలాగే అనవసరపు కోనుగోళ్లపైనా దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. నిత్యావసర సరకుల జాబితాలో ఉన్న ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా నియంత్రించాలని సీఎం స్పష్టం చేశారు. కొందరు కావాలనే రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలని సూచించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జరుగుతున్న ఈ తరహా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగంపై రైతులను చైతన్య పరిచేలా కార్యక్రమాలను, ప్రచారాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించిన రైతులకు ప్రోత్సాహకంగా సబ్సీడీని రైతుల ఖాతాల్లోకి జమ చేసే పథకంపైనా దృష్టి పెట్టి విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఉల్లి కొనుగోళ్లు- నిల్వలపై దృష్టి పెట్టండి కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు మద్ధతు ధరపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉల్లి క్వింటాలుకు రూ.1200 ధర తగ్గకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఎవరైనా ఆ ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఉల్లి పంట ఉత్పత్తి అంచనాల మేరకు నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లతో పాటు మార్కెట్ కు కూడా తరలించాలని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ ఘటనలో డ్రామా ఆడిన వారిపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. పంటను కనీస మార్కెట్ తేకుండానే పురుగుమందు తాగినట్టుగా డ్రామా చేసిన వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు అరకులో కాఫీ పంటకు సోకిన కాయతొలుచు పురుగు తెగులుపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే తెగులు సోకిన 60 ఎకరాల్లో పంట తొలగించామని మరో 20 ఎకరాల్లో తొలగింపు ప్రక్రియ జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే తురకపాలెం గ్రామంలో తలెత్తిన ఆరోగ్య పరిస్థితిపైనా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ వ్యాధికి మూలం ఎక్కడుందన్న అంశాన్ని గుర్తించాలని ఆదేశించారు. దీన్ని కేస్ స్టడీగా తీసుకుని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. పౌర సేవల్లో సంతృప్త స్థాయికే ప్రాధాన్యత ప్రభుత్వ విభాగాలు అందించే వివిధ పౌరసేవల్లో సంతృప్త స్థాయిపై ఇక ప్రతీవారం సమీక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఆర్టీసీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇలా వేర్వేరు శాఖల్లో అందిస్తున్న సేవలపై ఇంకా సంతృప్త స్థాయి పెరగాలని సీఎం పేర్కొన్నారు. ప్రజల నుంచి వ్యక్తం అయ్యే అభిప్రాయాలను డేటా అనలటిక్స్ ద్వారా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. కొన్ని చోట్ల రాజకీయ కారణాల వల్ల కూడా ప్రజల సంతృప్త స్థాయిపై ప్రభావం చూపుతోందని సీఎం అన్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ ప్రజలకు అందించే పౌరసేవల్ని మరింతగా మెరుగుపర్చుకోవాలని సూచించారు. అలాగే కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లు ఏమేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేందుకు ఉపకరిస్తున్నాయన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ నుంచి నిర్వహించిన సమీక్షకు సీఎస్ కే.విజయానంద్ సహా వ్యవసాయ శాఖ, వైద్యారోగ్యశాఖ, మార్కెటింగ్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. యూరియా సరఫరాపై అధికారులతో టెలికాన్ఫరెన్సు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి యూరియా సరఫరా, లభ్యతపై రైతులకు నమ్మకాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో మరోమారు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా లభ్యత సమృద్ధిగానే ఉందని దానిని సక్రమంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగిస్తే భూసారం కూడా దెబ్బతింటుందన్న అంశాన్ని రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. కొందరు రైతులు రబీ కోసం కూడా ఇప్పుడే కొనుగోలు చేయకుండా చూడాలని అన్నారు. రబీ పంట కోసం ముందస్తుగానే ఎరువులను సిద్ధం చేస్తున్నట్టు సీఎం పేర్కోన్నారు. కొందరు రాజకీయ ముసుగులో క్రిమినల్స్ తరహాలో ఆలోచిస్తూ ఎరువులు లభ్యత ఉండదన్న అభద్రతా భావాన్ని కల్పిస్తున్నారని దీన్ని నియంత్రించాలన్నారు. ఎక్కడా రైతుల్లో ఆందోళన లేకుండా భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. సీజన్ లో సాగునీరు ముందుగానే ఇవ్వటం వల్ల పంటల సాగుకూడా ఎక్కువ చేశారని.. వాణిజ్య పంటలైన ఉల్లి, మామిడి, మ్యాంగో, టమాటో, చీని కాయల ఉత్పత్తి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని .. దీనికి స్వల్ప, మధ్య, ధీర్ఘ కాలిక ప్రణాళికలు ఉండాలని సూచించారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా సహా విష జ్వరాలు సోకకుండా చర్యలు చేపట్టాలని సీఎం జిల్లా కలెక్టర్ కు సూచనలు జారీ చేశారు. ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు టెలికాన్ఫరెన్సు ద్వారా దాదాపు 5 గంటల పాటు సీఎం యూరియా సహా వివిధ అంశాలపై సమీక్షించారు. టెలికాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.