సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు.
ఈ ఎన్నిక జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేయడానికి నిర్వహించబడింది. ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బీ.సుదర్శన్ రెడ్డి పోటీపడ్డారు. పోలింగ్ ప్రారంభంలో ప్రధాని నరేంద్రమోదీ, అనంతరం కేంద్రమంత్రులు ఓటు వేసి తమ భాగస్వామ్యాన్ని చూపారు. ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయబడి, ప్రతి ఎంపీ తన ప్రాధాన్యత ప్రకారం ఓటు వేశాడు.
విపక్ష నేతలు కూడా తాము ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరుసగా ఓటు వేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు కూడా పోలింగ్‌లో పాల్గొన్నారు.
పోలింగ్‌లో మొత్తం 788 సభ్యులుండగా, ఖాళీ స్థానాలను మినహాయించి 781 సభ్యులు ఓటు హక్కు కలిగారు. 12 మంది (బీఆర్‌ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్) పోలింగ్‌లో పాల్గోలేదు. కాబట్టి మొత్తం 769 మంది ఎంపీలు ఓటు వేశారు. విజయం కోసం 391 ఓట్లు కావలసిన ఈ ఎన్నికలో, అధికార ఎన్‌డీఏకు 425 మంది సభ్యుల మద్దతు ఉండడంతో గెలుపు ఖాయం అయింది. వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు కూడా ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారు.
మరొకవైపు, విపక్ష అభ్యర్థి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి కు కేవలం 324 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉండటం గణాంకాల ద్వారా స్పష్టమైంది.