ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన
వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా
బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు
పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుబాట” మహాధర్నా ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. విద్యారంగంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయడంతోపాటు 12వ పిఆర్సి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేము 57 సూత్రాన్ని అమలు చేసి, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి మాట్లాడుతూ — ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ తరఫున బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి బహిష్కరణకు పిలుపునిచ్చారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు వెంటనే ఇవ్వాలని, 1998 డిఎస్సీ మిగిలిన వారికి పోస్టింగులు కల్పించాలని, 1998, 2008 డిఎస్సీ వారిని రెగ్యులర్ చేయాలని కోరారు.
అలాగే ఫ్యాప్టో నోటీసులో ఉన్న 20 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డిఎలను ప్రకటించాలని, దొడ్డి దారి బదిలీలు చేయడం అసమంజసం అని, న్యాయబద్ధమైన కౌన్సిలింగ్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. హైస్కూల్ ప్లస్‌లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఆ సంస్థలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, సొసైటీలలో సేవా విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ “పోరుబాట” కార్యక్రమంలో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి తోపాటు కో-చైర్మన్లు కె. నరహరి, బి. మనోజ్ కుమార్, సిహెచ్. వెంకటేశ్వర్లు, కె. ప్రకాశ్‌రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌లు ఎన్. వెంకటేశ్వర్లు, కె. భానుమూర్తి, జి. శ్రీనివాసరావు, కోశాధికారి చింతల సుబ్బారావు, కార్యదర్శి ఎం. ప్రవీణ్ కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. రఘునాథరెడ్డి, సిహెచ్. మంజుల, జి. హృదయరాజు, సిహెచ్. రమేష్, ఎం. బాబు రాజేంద్రప్రసాద్, సిహెచ్. రవి, పి. నరోత్తం రెడ్డి, బి. కరిమల్లారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఈ మహాధర్నాకు ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ బి. గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్. లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, ఏపీ సీపీఎస్సీఏ బాధ్యులు సి.ఎం. దాస్, సతీష్, బాజీ పఠాన్ తదితరులు హాజరయ్యారు.
