సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్
అభినందనలు తెలిపిన మంత్రులు, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు
ధైర్యంతో సంస్కరణలు చేయడం చంద్రబాబుకే సాధ్యమన్న మంత్రి పయ్యావుల
ముఖ్యమంత్రికి అవార్డు రావడం రాష్ట్రానికే గర్వకారణమన్న అచ్చెన్నాయుడు
టీమ్ వర్క్‌తోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు దక్కిందని సీఎం వ్యాఖ్య
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రకటించడం పట్ల పలువురు మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో పాలనా సంస్కరణలు తెచ్చిన సీఎం చంద్రబాబు... 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక... రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గడచిన 18 నెలల కాలంలో వివిధ సంస్కరణలు అమలు చేశారు. రాష్టానికి పెట్టుబడులను ఆకర్షించేలా ఇప్పటే 25 పాలసీలు తెచ్చారు. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రొత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని నిర్ణయించారు. ఇలాంటి అనేక పాలసీలను రూపొందించిన సీఎం చంద్రబాబుకు గుర్తింపుగా ఎకనమిక్ టైమ్స్ అవార్డు ప్రకటించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా సీఎం చంద్రబాబును దేశంలోని వివిధ ప్రముఖలతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది. గురువారం సచివాలయంలో జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అవార్డు వచ్చిన అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. మంత్రులు, సీఎస్, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రిని అభినందించారు.
*ఏపీ అభివృద్ధి మంత్రం నాయుడుగిరి: మంత్రులు*
సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ అవార్డు రావడంపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... “ఎకనామిక్ టైమ్స్ సంస్థ సీఎం చంద్రబాబుకు ఈ అవార్డును ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల మాట్లాడుతూ...”సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎకనామిక్ టైమ్స్ తమ పత్రికలో పేర్కొన్న హెడ్డింగ్ చదివితేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఈ రాష్ట్రం దాదాగిరిని చూసింది... అభివృద్ధికి దూరమైంది. ఇప్పుడు నాయుడుగిరిని చూస్తోంది... అభివృద్ధి వైపు వేగంగా పరుగులు పెడుతోంది. సంస్కరణలు చేపట్టాలంటే అసాధారణ ధైర్యం అవసరం. అలాంటి ధైర్యం టన్నుల కొద్ది సీఎం చంద్రబాబుకు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు 25 కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది... ప్రతి రోజూ కొత్తగా ఆలోచించాలని సీఎం ప్రేరణ ఇస్తుంటారు. ముఖ్యమంత్రి ఒక జనరేషన్ ముందే ఆలోచిస్తారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను తొలిసారిగా స్వీకరించిన రాష్ట్రంగా అప్పట్లో ఏపీని నిలిపిన ఘనత చంద్రబాబుదే. పవర్ సెక్టార్ రిఫార్మ్స్‌కు శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. ముఖ్యమంత్రి ఎప్పుడూ గుర్తింపు కోసం కాకుండా... ప్రజల సంతృప్తి కోసమే పని చేస్తారు. దేశంలో అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. చంద్రబాబు నాయకత్వంతో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది.”అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
*సహచరులు, అధికారుల క్రెడిట్‌తోనే అవార్డు: సీఎం చంద్రబాబు*
తనకు అవార్డు దక్కడంపై మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లు అభినందనలు తెలపడంపై సీఎం స్పందించారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తాను స్వీకరించలేదని, విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. ‘ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, జిల్లా కలెక్టర్లదే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రతీ ఏడాదీ ఏపీనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ వన్‌గా నిలిచాం. ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. 18 నెలల్లో 25 కొత్త పాలసీలతో పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తున్నాం. ప్రతీ నెలా ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియచేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని మరిచిపోలేం. గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలరా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం... చేసి చూపిస్తున్నాం. ప్రజలు, పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకువచ్చాం... దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తాం. లేబర్ కోడ్ గైడ్ లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించింది.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి స్పందనతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ చప్పట్లతో మార్మోగింది.
******

