గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు నగరంలోని ప్రతి ప్రాంతానికి త్రాగునీరు సమగ్రంగా అందించేందుకు చర్యలు చేపట్టామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్టేక్‌హోల్డర్ల సమావేశంలో డిపీఆర్‌పై సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.
అమృత్ 2.0 పథకంలో భాగంగా రూపొందించిన త్రాగునీటి ప్రాజెక్ట్ డిపీఆర్‌ను సమీక్షించేందుకు ఈ సమావేశం జరిగింది. డిపీఆర్ వివరాలను మాజీ సీఆర్డీఏ సీఈ ఆంజనేయులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
గతంలో సాధ్యం కాని లక్ష్యాన్ని చేరేందుకు పటిష్ట కృషి
2014 నుండి నగరంలో 24/7 త్రాగునీరు అందిస్తామని ప్రకటించినా, అది ఆచరణలో జరగలేదని మేయర్ గుర్తుచేశారు. ఇప్పటికీ కొన్నిచోట్ల నీటి ఎద్దడి కొనసాగుతోందని, రానున్న రోజుల్లో సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడుగు వేస్తున్నామని చెప్పారు.
గోరంట్ల కొండపై నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ప్రతి వారం పురోగతిపై నివేదిక అడుగుతున్నారని తెలిపారు. పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లను నెల నెలా శుభ్రపరచడం, అవసరమైన చోట కొత్త ఈఎల్ఎస్ఆర్‌లు నిర్మించడం తదితర చర్యలకు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రూ.540 కోట్లతో రెండు సంవత్సరాల్లో పనుల పూర్తి లక్ష్యం
కమిషనర్ మాట్లాడుతూ, రానున్న 30 సంవత్సరాల్లో త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్, యుఐడిఎఫ్ నిధులతో రూ.540 కోట్లతో డిపీఆర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. డిపీఆర్‌పై ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి సూచనలు
సమావేశంలో కార్పొరేటర్లు, రేట్‌పేయర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.