APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు
విజయవాడ ( జర్నలిస్ట్ పైల్ ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో అంతర్గత విభేదాలు ముదిరి, సంఘం స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయింది. కేఆర్ సూర్యనారాయణ వర్గం ఒకవైపు, శ్రీకాంత్ రాజు – ఆస్కార్ రావుల వర్గం మరోవైపు తాము అసలైన సంఘమని ప్రకటించుకుంటూ వాదన సాగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వివాదం కొనసాగుతున్న తరుణంలో, కమర్షియల్ ట్యాక్స్ శాఖకు చెందిన కీలక ఉద్యోగ నాయకులు సూర్యనారాయణ వర్గాన్ని వ్యతిరేకిస్తూ, శ్రీకాంత్ రాజు వర్గానికి మద్దతు తెలిపారు. వారి తరఫున ఐక్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో చర్చకు తావు కలిగింది.
బుధవారం రోజున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (APGEA), ఏపీసీటీజీవోస్ అండ్ ఎన్జీవోస్ అసోసియేషన్లు కలిసి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయోధ్యనగర్లోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని సందర్శించిన వట్టిపల్లి రామస్వామి (APCT JAC & NGOs అధ్యక్షుడు), మోహన్ దాస్ (ప్రధాన కార్యదర్శి) తదితరులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావును కలిసారు. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఐక్య కార్యాచరణ చేపట్టేందుకు మద్దతు ప్రకటించారు.ఈ సమావేశంలో ఎన్జీవో నాయకుడు ఎం. వెంకటేశ్వరరావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.