ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం
తిమ్మాపురంలో బహుళ ప్రయోజన గోదాం ప్రారంభంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను కూడా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాడినని, చిన్ననాటి నుంచి రైతుల సమస్యలు చూడగలిగానని తెలిపారు. మామూలుగా రైతులు తాము పండించిన పంటలకు తగిన ధర రాకపోవడం, దళారుల చేతిలో నష్టపోవడం జరుగుతుంటుందని, అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి గోడౌన్లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వాస్తవంగా ప్రస్తుతం భూముల ధరలు పెరిగిపోతున్న వేళ, తానున్న భూమిని ప్రజల కోసం దానం చేసిన దొప్పలపూడి సాంబశివరావు లాంటి వారు అభినందనీయం అని కొనియాడారు. ఇటీవల కాలంలో రోడ్ల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని, గత ఎన్నికల సమయంలో తాము ప్రయాణించిన దారులు ఇప్పుడు కొత్త రహదారులుగా మారి కనిపిస్తున్నాయని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధిని తీసుకొచ్చే బాధ్యతను తాను, రామాంజనేయులు కలిసి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గోడౌన్ నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చిన దొప్పలపూడి సాంబశివరావు, ఆయన భార్య ఉమాదేవి, గోదాం నిర్మాణ పర్యవేక్షణ చేపట్టిన సర్పంచ్ కల్లూరి శ్రీనివాస్ రావులను మంత్రి సత్కరించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాకినేని పెద్ద రత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, టీడీపీ మహిళా నేత వందనాదేవి, జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.