మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధం
వైసీపీకి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సవాల్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు తప్పుడు అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. జాగన్ హయాంలో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తోందని, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి కాలేజీ 420 పడకల ఆసుపత్రి, నాణ్యమైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నందుకు సవాల్ విసిరారు.
ఎప్పుడైనా, ఎక్కడైనా మీ ఇష్టం
ప్రజల ముందే నిజం తేల్చుకుందాం
వైసీపీకి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సవాల్
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. పీపీపీ విధానం అంటే ప్రైవేటుపరం కాదని, కాలేజీల యాజమాన్యం, నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానిదే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల నిర్మాణం వేగవంతం అవుతుందని, ప్రతి కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. “ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ కావాలనే విషప్రచారం చేస్తోంది” అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ చేస్తున్నది తప్పుడు ప్రచారం అని... “మెడికల్ కాలేజీలపై చర్చకు సిద్ధం... ఎప్పుడైనా, ఎక్కడైనా మీ ఇష్టం,” అని మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు..
వైసీపీ తప్పుడు ప్రచారం
మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ “జగన్ హయాంలో ప్రారంభించని, పూర్తి చేయని కాలేజీలను మేము ఎలా ప్రైవేటుపరం చేస్తాం? పీపీపీ విధానాన్ని వక్రీకరించి ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసలు సరైన పద్ధతి కాదు” అని నిలదీశారు. పీపీపీ మోడల్ వల్ల నిర్మాణాలు త్వరగా పూర్తవడంతో పాటు వైద్య విద్య మరింత మందికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గి, విద్యార్థులకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందుతాయని స్పష్టం చేశారు.
జగన్ హయాంలో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు
జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిందని మంత్రి తీవ్రంగా ఎద్దేవా చేశారు. మార్కాపురం కాలేజీ కేవలం 17 శాతం, మదనపల్లె 12 శాతం, పులివెందుల 77 శాతం, ఆదోని 15 శాతం మాత్రమే పూర్తయ్యాయని వివరించారు. “17 కాలేజీలు తెచ్చానని చెప్పుకునే జగన్ ఒక్కదాన్నీ పూర్తి చేయలేకపోయారు. రూ.8,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు. పైగా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో హాస్టళ్లు లేకుండా, సిబ్బంది లేకుండా, పరిపాలన లేకుండా అరకొర వసతులతో కాలేజీలు నడిపారు” అని మంత్రి సత్యకుమార్ దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వ చర్యలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కాలేజీ ప్రాజెక్టులు మళ్లీ పట్టాలు ఎక్కాయని మంత్రి గుర్తుచేశారు. 2024-25లో పాడేరులో మెడికల్ కాలేజీని ప్రారంభించామని తెలిపారు. మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ కాలేజీల నిర్మాణం వేగవంతం చేశామని వివరించారు. మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కళాశాలలను పూర్తి చేస్తామని, రెండో దశలో అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పార్వతీపురం కాలేజీలను పూర్తి చేస్తామని తెలిపారు. “ప్రతి కాలేజీ 420 పడకల ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటవుతుంది. తర్వాత ఈ ఆసుపత్రులు ప్రభుత్వానికే అప్పగిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.
పేదలకు ఉచిత వైద్య సేవలు
పీపీపీ మోడల్‌లో నిర్మించే ఆసుపత్రుల్లో పేదలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి భరోసా ఇచ్చారు. “ఓపీ పూర్తిగా ఉచితం. ఇన్‌పేషెంట్ సేవల్లో 70 శాతం పడకలు పీఎంజేఏవై, ఎన్టీఆర్ వీఎస్టీ, సీజీహెచ్ఎస్ వంటి పథకాల కింద ఉచితం. రోగులకు జనరిక్ మందులు కూడా ఉచితంగానే ఇస్తున్నాం” అని చెప్పారు. ఈ విధానం వల్ల పేదలకు ఎలాంటి భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు.
వైసీపీకి మంత్రి సవాల్
వైసీపీ నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. “జగన్ పూర్తి చేయని కాలేజీలను మేము ప్రైవేటుపరం చేస్తామన్నది పచ్చి అబద్ధం. ప్రజలను తప్పుదారి పట్టించడం మానేయాలి. మెడికల్ కాలేజీల అంశంపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా?” అని వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు.