న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట !
అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు రావాల్సిన బకాయిలు కోసం ఎదురు చూస్తూనే చనిపోతున్నారు
వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది కాదు
ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
'ఏపీ జేఏసీ అమరావతి' డిమాండ్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాజకీయ అధికారం మారినా, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదని, గత ప్రభుత్వానికి -ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా ఏం కనిపించడం లేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.ఆదివారం గుంటూరులో ఏపీ క్లాస్ 4 ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఎస్. మల్లేశ్వరరావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉద్యోగులంతా కోరుకున్న కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గాని “ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు 15 నెలల తర్వాత కూడా అమలు కాలేదు. రిటైర్ అయిన ఉద్యోగులు గ్రాట్యూటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంటు బకాయిలు అందకుండానే అనేక మంది చనిపోతున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కూడా బకాయిలు చెల్లించడం ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితులు ఉద్యోగులలో నిరుత్సాహం, ఆందోళనను పెంచుతున్నాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక, ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భౄతి ( ఐఆర్) ప్రకటన, 12వ పీఆర్శీ కమీషనర్ నియామకం, గత రెండు సంవత్సరాల కాలంలో రావలసిన ఐదు డిఏలు విడుదల, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రభుత్వ రోడ్ మ్యాప్ రూపొందించడం వంటి చర్యలు తీసుకోవాలని బొప్పరాజు సూచించారు. ఈ.హెచ్.యస్ పేరుతో ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున చందా రుసుము వసూలు చేస్తున్నప్పటికీ ఉద్యోగులకు మాత్రం నగదురహిత వైద్యం దొరకడం లేదని వాపోయారు. అంతేకాకుండా బకాయిల విడుదల కోసం ప్రతి పండగకు ఉద్యోగులు గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తూన్నారే గాని ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఉద్యోగులలో ఉన్న ఆందోళనలను, బాధను దృష్టిలో పెట్టుకొని తదుపరి నిర్వహించబోయే ఏపి జేఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తామని బొప్పరాజు తెలియజేసారు.
క్లాస్ 4 ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. మల్లేశ్వరరావు మాట్లాడుతూ, “రాష్ట్రంలోని 14 జిల్లాల వరకు జిల్లా కార్యవర్గాలు ఇప్పటికే ఏర్పడినవే. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో కూడా త్వరలో జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేసి, ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టినా రాష్ట్ర క్లాస్ 4 ఉద్యోగుల అసోసియేషన్ సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
సభలో ఏపిజేఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, స్టేట్ ఉమెన్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి పారే లక్ష్మి, సిటీ జేఏసీ ప్రధాన కార్యదర్శి మందపాటి శంకరరావు, ఏపీ ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా రెవిన్యూ సర్వీసెస్ జిల్లా అధ్యక్షులు పి.ఏ. కిరణ్ కుమార్, రాష్ట్ర నాయకులు, 13 జిల్లాల జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.