గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగుల తరఫున ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్, కో-ఛైర్మన్లు బత్తుల అంకమ్మరావు, వి. భార్గవ్ సుతేజ్, యువ షణ్ముఖ్, డెప్యూటీ సెక్రటరీ జనరల్ యస్. నాగేశ్వరరావు, వైస్ ఛైర్మన్లు యస్.కె. మహబూబ్ బాషా, జి.వి.యస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ల దస్త్రాన్ని మళ్లీ ఆర్థిక శాఖకు పంపించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలను ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆరు సంవత్సరాలు ఒకే క్యాడర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు కోసం చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.

దివ్యాంగ ఉద్యోగులను క్షేత్రస్థాయి విధుల నుండి విముక్తి కల్పించేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పండుగలు, ఆదివారాలు, సెలవు రోజుల్లో విధులు అప్పగించరాదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్‌ను ఆన్లైన్ విధానంలో అమలులోకి తెస్తామని, సెలవులు మంజూరుకు ఇబ్బందులు లేకుండా 24 గంటల్లో ఆటోమేటిక్ అప్రూవల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పదోన్నతుల సమస్యల పరిష్కారం కోసం అన్నీ శాఖల మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ మరియు డిసెంబర్‌లో స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారు.

సంక్షేమ విద్యాసహాయకులు మరియు వార్డు విద్యా కార్యదర్శులు స్కూల్ టాయిలెట్స్ ఫోటోలు తీసే విధుల నుండి విముక్తి కల్పించాలని ఐక్యవేదిక ప్రతినిధులు కోరగా, సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కార్యదర్శి అన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న జి.ఒ 523ను సవరించాలని కోరగా, మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని విభాగాల సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.

తరువాత సచివాలయాల శాఖ మంత్రికార్యాలయం పిలుపు మేరకు ఐక్యవేదిక ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. మంత్రివర్యులు రాష్ట్ర సచివాలయాల శాఖ కార్యదర్శి నుండి నివేదిక కోరించి, న్యాయమైన అన్నీ సమస్యలను నిర్ధిష్ట గడువులో పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.

About The Author

Latest News