డీఏ ఇస్తున్నాం... ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ కూడా...
దివాళీ కానుకగా డీఏ ప్రకటించిన సీఎం — నవంబరు 1న ఖాతాల్లో జమ
పోలీసులకి రూ.210 కోట్లు — 60 రోజుల్లో హెల్త్ సిస్టం స్ట్రీమ్‌లైన్
ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం
180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం
చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు
ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం
4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తాం
ఉద్యోగులే రాష్ట్ర అభివృద్ధికి శక్తి కేంద్రం: సీఎం చంద్రబాబు
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ప్రభుత్వం–ఉద్యోగుల సంబంధాలపై సమగ్ర చర్చ నిర్వహిస్తూ, “ఉద్యోగులతో సమన్వయం ద్వారానే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలం” అన్నారు.
ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తదితరులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
డీఏ, హెల్త్, పోలీసుల చెల్లింపులు
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చెప్పారు — “ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబరు 1న ఖాతాల్లో జమ చేస్తాం. దీని వలన ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.160 కోట్ల అదనపు భారం పడుతుంది. పోలీసులకు సరెండర్ లీవ్ క్లియర్ చేయడానికి రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తాం. 60 రోజుల్లోపు ఉద్యోగుల ఆరోగ్య వ్యయ వ్యవస్థను పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేస్తాం.”
ఉద్యోగి సంక్షేమానికి కొత్త చర్యలు ... చంద్రబాబు ప్రకటించిన ఇతర చర్యలు ఇలా ఉన్నాయి:
-
చైల్డ్ కేర్ లీవ్స్‌ను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పించాం.
-
ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు దీపావళి లోపు క్లియర్ చేస్తాం.
-
ఉద్యోగ సంఘాల భవనాలపై ఉన్న ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం.
-
4వ తరగతి ఉద్యోగుల గౌరవం పెంచేందుకు హోదా పేర్లను రీడెసిగ్నేట్ చేస్తాం.
-
ఆర్థిక వెసులుబాటు వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తాం.
-
సీపీఎస్ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటాం.
“ప్రతిఒక్కరికీ శుభదీపావళి”
“ఉద్యోగులు సంతోషంగా ఉండాలి, ఒక కుటుంబంలా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అప్పుడు మాత్రమే హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సాధ్యమవుతుంది,” అని సీఎం అన్నారు. “ఉద్యోగులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రభుత్వం మనందరిదీ అని గుర్తుంచుకుని పనిచేయాలి,” అని పిలుపునిచ్చారు.
నష్టం సరిచేసే దిశగా...
“గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నాం. గూగుల్ లాంటి సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టడం చారిత్రాత్మక ఘట్టం. గత ఐదేళ్లలో పొరుగు రాష్ట్రాల్లా ఆర్థిక క్రమబద్ధత పాటించకపోవడం వలన ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ప్రతిదీ సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాం,” అని ఆయన పేర్కొన్నారు.
“గత పాలనలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రాష్ట్రం ఇబ్బందులు పడింది. భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అనుత్పాదక వ్యయం చేశారు. ఇప్పుడు మేము ఆ విధ్వంసాన్ని సరిచేస్తున్నాం” అని అన్నారు. పొరుగు రాష్ట్రాలు గత ఐదేళ్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులను తగ్గించుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో 91 శాతం వ్యయం ఇప్పటికీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కే వెళ్తోందని వివరించారు.
“ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం మనందరిదీ అని గుర్తుంచుకుని కలిసి పని చేయాలి” అని పిలుపునిచ్చారు.
“టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. రాష్ట్ర పునర్నిర్మాణం చేయగల శక్తి కూటమికే ఉందని ప్రజలు నమ్మి ఓటేశారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.
"ఉద్యోగులే రాష్ట్ర రథచక్రాలు"
“రూ.51,452 కోట్లను ఎస్టాబ్లిష్మెంట్ కోసమే ఖర్చు చేస్తున్నాం — అంటే 91 శాతం వ్యయం. కానీ ఇది భారం కాదు, పెట్టుబడి. ఎందుకంటే ఉద్యోగులే రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు,” అని చంద్రబాబు అన్నారు. “సంపద సృష్టి జరిగితేనే సంక్షేమం సాధ్యం. సుపరిపాలన ద్వారానే పెట్టుబడులు ఆకర్షించగలిగాం. అదే ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది అవుతుంది,” అని తెలిపారు. చివరిగా సీఎం ఉద్యోగులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, “దీపావళి తర్వాత ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నా. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా తీసుకెళ్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.