ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం : సీఐటీయూ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలలో రెండు మాత్రమే ఇవ్వాలని ప్రకటించింది. ఉద్యోగులకు మొత్తం దాదాపు 32 వేల కోట్ల రూపాయల వేతన బకాయిలు, వీటిలో నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన బకాయిలు 835 కోట్లుగా ఉండగా, కేవలం 105 కోట్ల రూపాయలే చెల్లించడమేంటని నిలదీశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, పిఆర్సి, కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, సంక్షేమ పధకాలు అమలు చేయడం, సిపిఎస్ రద్దు చేయడం వంటి హామీలను ఇంకా అమలు చేయకపోవడం ఉద్యోగుల అసంతృప్తికి కారణమని వారు పేర్కొన్నారు.సీఐటీయూ రాష్ట్ర కమిటీ మిగిలిన మూడు విడతల డీఏ బకాయిలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాల్సినవిగా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.