పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా సిపిఎస్ విధానం లోకి వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్, ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ ఒక ప్రకటనలో ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులకు మాత్రమే పాత పెన్షన్ అమలు చేయడం, మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం మొండి చేయి చూపించడం పరిస్థితులను గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, గ్రూప్ 2, గ్రూప్ 1 అధికారులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు మొదలుపెట్టడం ప్రత్యేకంగా ప్రాముఖ్యత పొందిందని వారు పేర్కొన్నారు.
అదేవిధంగా, మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం సమర్థమైన పరిష్కారం చూపనుందన్న హామీను ఇచ్చిందని తెలిపారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావలసిన డీఎ బకాయిలను కూడా త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమానికి మేలుగా ఉంటుంది మరియు సీపీఎస్ ఉద్యోగుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. తమ ప్రాతినిధ్యం మేరకు మెమో 57 అమలు చేయాలని పట్టు పట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి , అమలు చేయించడంలో ప్రకటించడంలో ప్రముఖమైన పాత్ర వహించిన ఎపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ , సెక్రటరీ జనరల్ ప్రసాద్ , జేఏసీ సభ్య సంఘాలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.