ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
-లెక్కల జమాల్ రెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఐఆర్ ప్రకటిస్తామని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏల అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి రాగానే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులను నిరాశపరుస్తున్నది. నలుగురు పెండింగ్ డీఏలలో రెండు మాత్రమే చెల్లిస్తారని చెప్పడం అసమాధానకరమని లెక్కల జమాల్ రెడ్డి తెలిపారు.
అలాగే, ఐఆర్‌పై స్పష్టత లేకపోవడం, పిఆర్సి పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉద్యోగుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టమైన హామీ, వేతన, డీఏ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.