భూవివాదాలను భూవిశ్వాసంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : భూ వివాదాల సమస్యల నుంచి ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా భూ రికార్డుల రీసర్వే మరియు డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతంగా కొనసాగిస్తోంది. 2027 నాటికి ఈ పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖకు చెందిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరిగిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ మనోజ్ జోషి, డైరెక్టర్ డి.ఎన్. జోషి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, భూ రికార్డుల రీసర్వే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేగంగా జరుగుతున్నదని, ఇతర రాష్ట్రాల్లో పనులు మందగమనంతో సాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేగం పెంచేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయి కార్యక్రమాలు గుంటూరులో తక్కువగా జరుగుతున్నాయనే కారణంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకురాగలిగామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల అధికారులు గుంటూరులో చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయం అన్నారు.
భూమి భారతదేశంలో కేవలం ఆస్తి మాత్రమే కాకుండా గౌరవానికి, ఆర్థిక భద్రతకు సంకేతంగా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో వేలాది భూవివాదాలు పెండింగ్‌లో ఉండటంతో యజమానులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అమెరికాలో భూముల రిజిస్ట్రేషన్ విధానం చాలా వేగంగా జరిగి, కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి అయిందని, అలాంటి పారదర్శక వ్యవస్థను మన దేశంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
భూముల రీసర్వే వంద సంవత్సరాల తర్వాత జరుగుతున్నదని, కాబట్టి అధిక జాగ్రత్తలతో నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగించాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది కొరత, నిధుల సమస్యలతో కొంత వెనుకబాటులో ఉన్నా వాటిని అధిగమించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ చిన్న రైతులకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డుల డిజిటలైజేషన్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజధాని అమరావతి అద్భుతంగా నిర్మాణం చెందుతోందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమం భూ పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడమే కాకుండా, ప్రజలకు భూమిపై నమ్మకాన్ని కలిగించే విధంగా మారాలని కేంద్రం భావిస్తోంది.