భారత్ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు
భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని కదిలించిందన్నారు. జాతీయ భద్రత కోసం జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ శుక్రవారం ట్వీట్ చేశారు.
ఇలాంటి సమయంలో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్థాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను భారత బలగాలు ప్రదర్శించాయని పవన్ కల్యాణ్ చెప్పారు. భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
తమిళనాడులోని దేవసేనాని సుబ్రహ్మణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో జనసేన నేతలకు, జనసైనికులను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మతాలకు అతీతంగా ఈ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా, బలంగా నిలబడుదాం, భారత దేశపు ఐక్యతను చాటి చెబుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.