కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దుష్ప్రచారం చేసే కాంగ్రెస్: కెటిఆర్ మండిపాటు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారానే వాడుకుంటూ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నవారే, ఇప్పుడు అదే నీటిని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, సిఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
శంకుస్థాపన డ్రామా – ఘాటు వ్యాఖ్యలు
మల్లన్నసాగర్ దగ్గర శంకుస్థాపన చేస్తే ఇవి కాళేశ్వరం నీళ్ళేనని రైతులు ప్రశ్నిస్తారనే భయంతో గండిపేట దగ్గర డ్రామా చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “జ్ఞానం ఉన్నవాళ్లు తల దగ్గర శంకుస్థాపన చేస్తారు.. తల, తోక తేడా తెలియనివాళ్లే తోక దగ్గర చేస్తారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వారం కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడినవారే, ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకువస్తున్నారని విమర్శించారు.
లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు
ప్రాణహిత-చేవెళ్లలో ఎలాంటి స్టోరేజ్ కెపాసిటీని ఏర్పాటు చేయని కాంగ్రెస్, తాము మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో 15 రిజర్వాయర్లు నిర్మించామని కేటీఆర్ చెప్పారు. దీంతో సహజంగానే ఖర్చు పెరిగిందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీరు తేవడానికి తమ హయాంలో రూ.1,100 కోట్లతో చేసిన అంచనాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు రెట్లు పెంచి రూ.7,390 కోట్లకు చేర్చిందని ఆరోపించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు పెంచారని మండిపడ్డారు.
మేడిగడ్డపై కుట్ర
మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్ల రిపేర్లు రూ.250 కోట్లు మాత్రమే అవుతాయని, నిర్మాణ సంస్థ తామే రిపేర్ చేస్తామని ముందుకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. “మేడిగడ్డను బొందపెట్టే కుట్ర వెనుక బనకచర్ల ప్రయోజనాలున్నాయి” అని ఆరోపించారు. సుంకిశాలలో బ్లాక్‌లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకే రూ.7,400 కోట్ల పనులు అప్పగించారని ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు 24 గంటల తాగునీటి భరోసా
“హైదరాబాద్ నగరానికి 24 గంటలు తాగునీరు అందించేది మన ప్రభుత్వమే” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కిమీ మేర రింగ్ మెయిన్ నిర్మించామని, రాబోయేది తమ కెసిఆర్ ప్రభుత్వమేనని, మిగతా పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
డ్రగ్స్ వ్యవహారంలో సిఎంకు ముడుపులేనా?
మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ బయటపెట్టారని, ఇంత పెద్ద వ్యవహారంలో స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేశారని ప్రశ్నించారు. 21 నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే సిఎంకు ముడుపులు ముట్టాయా? అని నిలదీశారు.
కవిత సస్పెన్షన్‌పై స్పందన
పార్టీ చర్చించిన తర్వాతే కవితపై చర్యలు తీసుకున్నామని, ఆ నిర్ణయంపై వ్యక్తిగతంగా తాను వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫిరాయింపు ఎంఎల్యేలపై తక్షణ వేటు డిమాండ్
పార్టీ మారిన ఎంఎల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి అప్రూవర్‌గా మారారని, ఈ విషయంలో విచారణ అవసరం లేదని పేర్కొన్నారు.