కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వెనుకబాటుకు కాంగ్రెస్, టిడిపి కారణమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రజలు సిఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో 12 సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.
జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన కెటిఆర్, “మేము పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం. ఇంకా 10 శాతం పనులు ముగిస్తే 12 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు గడిపినా పాలమూరుకు ఏమాత్రం మేలు జరగలేదు” అని విమర్శించారు.
కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, స్పీకర్ ఇప్పటికీ చర్యలు తీసుకోవడంలో మొహమాటం ఎందుకని ప్రశ్నించారు. “కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉంది. పార్టీ మారకపోతే బిఆర్ఎస్ ఎల్పీకి ఎందుకు రాలేదో?” అని నిలదీశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని, పిసిసి అధ్యక్షుడి స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు ముందుంచుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నవారు సిగ్గులేకుండా పార్టీ మారలేదని చెప్తున్నారని కేటిఆర్ తీవ్రంగా ఎద్దేవా చేశారు.