సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్య పరిష్కరించాలి
- ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం నిధి భవన్లోని పే అండ్ అకౌంట్స్ అధికారి శ్రీమతి లలితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గత కొంతకాలంగా సీపీఎస్ ఉద్యోగుల పింఛను చందాలు సరైన విధంగా ప్రాన్ ఖాతాల్లో ప్రతిబింబించకపోవడం వల్ల వారి భవిష్యత్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగ పరిధిలోని ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిన నేపథ్యంలో, పీఏఓ పరిధిలో ఉన్న సచివాలయ మరియు హెచ్ఓడీ ఉద్యోగుల సమస్యలను కూడా అదే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదనలు పంపాలని పీఏఓను కోరారు.
వినతిపత్రాన్ని పరిశీలించిన పే అండ్ అకౌంట్స్ అధికారి శ్రీమతి లలిత సత్వరమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో పాటు పలు హెచ్ఓడీ శాఖల ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.