ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం
మంత్రి సత్య కుమార్ కు చెక్కును అందజేసిన "తిరుమల గుబ్బా చౌల్ట్రీ" స్వచ్ఛంద సంస్థ
విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం శత్రువులతో వీరోచితంగా పోరాటాలు చేస్తూ సత్తా చాటుతోందని వారు చెప్పారు. ఈ పోరాటంలో ఎందరో సైనికులు అమరులయ్యారని, సైన్యం చేస్తున్న పోరాటాలకు వెన్నుదన్నుగా తమ స్వచ్ఛంద సంస్థ తరఫున విరాళాన్ని అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు. మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ దేశ రక్షణ కేవలం సైనికులది మాత్రమే కాదని, ప్రతి భారత పౌరుడు దేశం కోసం సేవాభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు, "తిరుమల గుబ్బా చౌల్ట్రీ" స్వచ్ఛంద సంస్థ వారు తమవంతుగా రూ.కోటి విరాళాన్ని అందించడం స్వాగతించదగ్గ విషయమని చెప్పారు. ఈ సంస్థ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, తిరుమల గుబ్బా చౌల్ట్రీ స్వచ్ఛంద సంస్థ ధర్మకర్తలు చెక్కా నాగకుమార్ , శ్రీహరి , దారా సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.