థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం నెలకొంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించగా, అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా చర్చించి పలు కీలక ప్రయోజనాలకు అంగీకారం తెలపడం హర్షణీయమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) నాయకులు పేర్కొన్నారు.
డీఏ పెంపుతో పాటు రూ.830 కోట్ల ఈఎల్స్ జమ, పోలీసులకు సరెండర్ లీవ్ అనుమతి, మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్‌ను పూర్తి సర్వీస్ పొడవునా వినియోగించే అవకాశం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు వంటి నిర్ణయాలు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఊరటనిచ్చాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు బండారు హరీష్, రజనీబాబు నాయుడు, కే. రామలింగప్ప, చుండి పద్మావతి, పూర్ణచంద్రరావు, కొత్తగొర్ల వెంకటరావు, మక్కపాటి రాంబాబు, తల్లపనేని రామారావు, ఎన్. జగదీశ్, కే. జయరాజు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగుల పట్ల సానుకూల వాతావరణం నెలకొల్పుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో మరింత మేలు చేస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.