దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్
మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు
జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు
తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. సైనికుల సంకల్ప బలానికి దైవ బలం తోడుగా ఉండాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం జనసేన తరపున పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో షష్ట షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులు దేశ సైనికులకు తోడుగా ఉండాలని కాంక్షించారు. పాకిస్తాన్ ముష్కరులను అణచివేసేలా చూడాలని భగవంతున్ని ప్రార్థించానన్నారు. ఉద్రిక్త వాతావరణం మధ్య విధులు నిర్వహిస్తున్న సైనికులకు తోడుగా యావత్ దేశ ప్రజలు అందరూ అండగా ఉన్నామని భరోసానిచ్చారు. జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
తొలుత నిడదవోలు నుండి వేమగిరి మీదుగా మంత్రి కందుల దుర్గేష్ తో పాటుగా జనసైనికులతో ప్రారంభమైన బస్సు యాత్ర బిక్కవోలుకు చేరుకున్న అనంతరం ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం సజావుగా జరగాలని ప్రఖ్యాత పురాతన లక్ష్మీ గణపతి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత జాతీయపతాకాలు పట్టుకొని జనసైనికులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి దుర్గేష్ కు ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మన దేశం ఆర్థికంగా, సైనిక శక్తిగా దృఢంగా ఉన్నా దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుమేరకు బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం దేశ త్రివిధ దళాలకు మెండుగా ఉన్న నేపథ్యంలో వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిది అని గుర్తుచేస్తూ నిర్వర్తించిన పూజలు సైనికులకు మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. సురులను కాపాడి అసురులను సంహరించిన సుబ్రహ్మణ్యస్వామిలా నేడు దుష్టముష్కరుల నుండి, ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని కాపాడుతున్న నిజమైన సైన్యాధ్యక్షులు భారతసైనికులు అని మంత్రి దుర్గేష్ అన్నారు. భారత సైన్యం చూపిస్తున్న తెగువ, చేస్తున్న త్యాగం దృష్టిలో పెట్టుకొని వారికి ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శాంతికాముకంగా ఉన్న భారతదేశంలో ఎలాంటి అరాచకాలు జరగొద్దని కాంక్షించినట్లు మంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అమాయకులైన 26 మంది పర్యాటకుల్ని పహల్గాంలో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకల్ని భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ తో ఇప్పటికే తుద ముట్టించిందని వెల్లడించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధంలో భారత సైన్యానికి, ప్రధాని మోదీకి భగవంతుని ఆశీస్సులు, దైవబలం మెండుగా ఉండాలని ప్రార్థించామన్నారు. ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు చేశామన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం, దేశ సమగ్రత కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన సైనికులకు నివాళులు అర్పించారు. సరిహద్దుల్లో సైనికుల పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. కీలక సమయంలో దేశ ప్రజల ఐక్యత నిరూపితమైందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జై జవాన్, భారత్ మాతాకీ జై, జయహో భారత్ అంటూ మంత్రి కందుల దుర్గేష్ నినదించారు.కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.