117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్న విధంగా విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు నంబర్ 21ను వెంటనే ఉపసంహరించుకోవాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (నాటా) డిమాండ్ చేసింది. గతంలో విడుదలైన 117 జీవోకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ ఉత్తర్వులు ఉపాధ్యాయ విద్యా రంగానికి పెను సవాలుగా మారనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
117 జీవో ద్వారా మూడు, నాలుగు, ఐదు తరగతులను మెర్జ్ చేసి, దాదాపు 7500 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల వల్ల ఆ పదోన్నతులు అమలులో ఉండే అవకాశమే లేదని, వారి పట్ల అన్యాయం జరుగుతుందని సంఘం ఆరోపించింది. ఇది 117 జీవోకు ప్రత్యమానం ఎలా అవుతుందో ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని హరికృష్ణ వ్యాఖ్యానించారు.
తరగతి గదుల పరిమాణాల్లో, పని భారం విషయంలో, విద్యాబోధన విధానాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త ఉత్తర్వులు జారీ చేయడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రతి మోడల్ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమిస్తామని చెప్పి, ప్రస్తుతం కేవలం 60 మంది విద్యార్థులకు ముగ్గురు ఎస్జీటీలు, 150 మంది విద్యార్థులకు నలుగురు ఎస్జీటీలు, ఒక పిఎస్ హెచ్‌ఎం నియమించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
2022 వరకు వారానికి గరిష్టంగా 32 పిరియడ్లు ఉండగా, ఇప్పుడు 38కి పెంచడం వల్ల ఆరుగురు చేసే పనిని ఐదుగురు ఉపాధ్యాయులతో చేయించాలని బలవంతం చేస్తుండటం వల్ల అనేకమంది ఉపాధ్యాయులు శారీరక, మానసికంగా కొలిమిలో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
1300 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా మార్చడం బాలికలపై ప్రభావం చూపుతుందని, ఇది బాల్య వివాహాలకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకొని, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.